2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు. లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC), బీపీసీఎల్, ఐవోబీ, ఐడీబీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల్లో వాటాల విక్రయానికి కేంద్రం సిద్దపడుతోంది. ప్రయివేటీకరణకు సంబంధించి ఈ ఏడాది ముఖ్యమైన సంవత్సరంగా నిలిచిపోతుందన్నారు. ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ దిశగా అడుగు పడుతోందని చెప్పారు.

సంస్కరణలు ఫలితం
కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు ఫలితాన్ని ఇస్తున్నాయని, ఈ ఆర్థిక సంస్కరణల కారణంగా వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పీవీ నర్సింహా రావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల తరహాలోనే రెండోతరం సంస్కరణలు కూడా బలమైన ప్రభావం చూపుతాయన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశానికి కొత్త దశ ఇచ్చారని, పీవీ మరువలేని ఆర్థిక సంస్కర్త అన్నారు.

వీటికి ప్రాధాన్యం
కార్మిక సంస్కరణలు, ప్రయివేటు పెట్టుబడుల సమీకరణకు ప్రాధాన్యం, ఉత్పత్తి రంగానికి ప్రోత్సాహం, 13 రంగాలకు వర్తించే విధంగా పీఎల్ఐ పథకం ఆవిష్కరణ, వ్యవసాయం, విద్యుత్ రహదార్లకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు తొమ్మిది శాతం ఉండగలదని అంచనా వేశారు. ఆర్థిక వ్యవస్థలోని అల్పాదాయ వర్గాల ప్రజలు పురోగమించడానికి వచ్చే ఇరవై ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం ఎంతో కీలకమన్నారు.

వీ షేప్ రికవరీ
ఆర్థిక వ్యవస్థపై కరోనా తొలి విడత ప్రభావంతో పోలిస్తే రెండో విడత ప్రభావం తక్కువగా ఉందన్నారు. వచ్చే కొద్ది నెలల్లో ఆర్థిక వ్యవస్థ V షేప్ రికవరీని నమోదు చేయగలదని భావిస్తున్నట్లు తెలిపారు. మొదటిసారి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేయడం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, రెండో విడతలో జీడీపీలో 30 శాతం వాటాను అందించే రాష్ట్రాల్లో మాత్రమే లాక్‌డౌన్‌ను అమలు చేశారు. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 24 శాతం క్షీణించింది. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల మూడు, నాలుగు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకుందని, నాలుగో త్రైమాసికంలో 1.34 శాతం వృద్ధి రేటు నమోదయిందన్నారు.


Click it and Unblock the Notifications