ఖర్చుల తగ్గింపు ఆలోచనలో రోల్స్ రాయిస్.. చావుకబురు చల్లగా చెప్పేందుకు మీటింగులు
Layoffs: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వల్ల ఒక్క IT రంగమే కాకుండా వివిధ విభాగాలు సైతం దారుణంగా నష్టపోతున్నాయి. ఇక ఉద్యోగుల సంగతి అయితే చెప్పనవసరం లేదు. ఓ పక్క ఆర్థిక మందగమనం, మరోపక్క ఆటోమేషన్ వల్ల కొలువులు కోల్పోతూ ఎటూ పాలుపోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
గ్లోబల్ ఇంజినీరింగ్ దిగ్గజం రోల్స్ రాయిస్ తన సిబ్బందికి షాక్ ఇచ్చింది. ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 2 వేల 500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. కంపెనీకి మొత్తం 42 వేల మంది సిబ్బంది ఉండగా.. వారిలో సగం శ్రామిక శక్తి ఒక్క UKలోనే ఉంది. కాబట్టి ఈ నిర్ణయం ప్రభావం ఎక్కువగా ఆ దేశంపైనే పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉద్యోగాల కోత గురించి రోల్స్ రాయిస్ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ప్రకటన చేసేముందు వర్కర్స్ యూనియన్స్‌తో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కంపెనీని పునః నిర్మిస్తున్నాము. మా కస్టమర్లు, భాగస్వాములు, వాటాదారుల కోసం మరింత క్రమబద్దీకరించబడిన, సమర్థవంతమైన సంస్థను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం' అని CEO ఎర్గిన్‌బిల్జిక్ తెలిపారు.
కొవిడ్ ఉద్ధృతి సమయంలో అంతర్జాతీయ ప్రయాణాలకు డిమాండ్ లేకపోవడంతో రోల్స్ రాయిస్ ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. అయితే ప్రపంచ విమానయానం తిరిగి పుంజుకోవడంతో గత ఏడాది కొంతమేర మెరుగుపడింది. 2023 ప్రారంభం నుంచి దాని షేర్ ధర రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగినట్లు ప్రముఖ వార్తాపత్రిక నివేదించింది.


Click it and Unblock the Notifications