అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..
ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభంపై అత్యంత లోతైన, విమర్శనాత్మక విశ్లేషణను అందించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనిశ్చితికి మూలాలు ఐదు దశాబ్దాల క్రితం.. ముఖ్యంగా 1974 లో తీసుకున్న నిర్ణయాల్లోనే ఉన్నాయని ఆయన బలంగా వాదిస్తున్నారు.
పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి విశ్లేషణ ప్రకారం.. 1974వ సంవత్సరం అమెరికా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఆ ఏడాదిలోనే యూఎస్ డాలర్ తన పూర్వ వైభవాన్ని కోల్పోయేలా చేసే రెండు ప్రధాన మార్పులు చోటుచేసుకున్నాయి. మొదటిది, డాలర్‌కు ఉన్న బంగారు మద్దతును (Gold Standard) తొలగించి, దానిని చమురుతో ముడిపెట్టడం ద్వారా 'పెట్రోడాలర్' వ్యవస్థను తీసుకురావడం. దీనివల్ల డాలర్ విలువ కేవలం ఒక కాగితం ముక్కగా మారిందని.. ఇది నేటి ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని ఆయన అంటారు.

రెండవది, అదే సంవత్సరంలో ప్రవేశపెట్టిన ERISA (Employees Retirement Income Security Act). ఈ చట్టం వల్ల ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే 'హామీతో కూడిన పెన్షన్ల' స్థానంలో 401(k) వంటి మార్కెట్ ఆధారిత పొదుపు పథకాలు వచ్చాయి. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అనేది వ్యక్తిగత అదృష్టంగా లేదా మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడే అంశంగా మారిపోయింది. 1974లో సృష్టించబడిన భయంకరమైన భవిష్యత్తు ఇప్పుడు మన కళ్లముందే ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
అమెరికా నేడు ప్రపంచంలోనే అత్యధిక అప్పులు ఉన్న దేశాలలో ఒకటిగా మారిందని Robert Kiyosaki గుర్తుచేశారు. పెరుగుతున్న అప్పులు, ఆహార, గృహవసతి ధరల పెరుగుదల సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల చమురు ధరలు పెరగడం, పెట్రోడాలర్ వ్యవస్థను మరింత బలహీనపరుస్తోంది. ఈ నిర్మాణాత్మక లోపాలు వ్యవస్థను కూల్చివేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాలలు మనకు డబ్బు గురించి ఎందుకు బోధించవు?" అనే తన చిరకాల ప్రశ్నను ఆయన మళ్ళీ సంధించారు. ప్రభుత్వాలు లేదా విద్యా వ్యవస్థలు ప్రజలను ఆర్థికంగా స్వతంత్రులుగా మార్చడానికి ఇష్టపడవు కాబట్టి, వ్యక్తులే స్వయంగా ఆర్థిక విద్య (Financial Education) అభ్యసించాలని ఆయన పిలుపునిచ్చారు. డబ్బు ఎలా పనిచేస్తుంది? ద్రవ్యోల్బణం నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? అనే విషయాలు తెలియకపోతే రాబోయే రోజుల్లో మనుగడ కష్టమని ఆయన స్పష్టం చేశారు.
సాంప్రదాయ బ్యాంక్ పొదుపులు లేదా స్టాక్ మార్కెట్లపైనే భారం వేయకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కియోసాకి సూచించారు. ఇవి వేల ఏళ్లుగా తమ విలువను కోల్పోని 'నిజమైన డబ్బు ఏమైనా ఉందంటే అదే బంగారం, వెండి అని తెలిపారు. అలాగే డిజిటల్ యుగంలో ప్రభుత్వ నియంత్రణ లేని అత్యంత శక్తివంతమైన ఆస్తి బిట్‌కాయిన్ అని అన్నారు.
ఓడిపోయిన వారికి (అంటే ఆర్థిక అవగాహన లేని వారు లేదా వ్యవస్థను నడిపే వారు) మీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇవ్వకండి అని ఆయన గట్టిగా చెప్పారు. మీ ఆర్థిక భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలని, వ్యవస్థ ఇచ్చే హామీల కంటే మీ సొంత అవగాహనపైనే నమ్మకం ఉంచాలని కియోసాకి ఈ విశ్లేషణ ద్వారా ప్రపంచానికి సందేశమిచ్చారు. నేటి అస్థిరమైన ఆర్థిక వాతావరణంలో ఈ పాఠాలు కేవలం అమెరికన్లకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మదుపరులందరికీ వర్తిస్తాయని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications