డాలర్‌కు మరణశాసనం.. చైనా కరెన్సీతో ట్రేడ్ మొదలు పెట్టిన ఇరాన్.. పెట్రో డాలర్ పతనంతో అమెరికాలో వణుకు..
ప్రపంచవ్యాప్తంగా రణరంగాలు సృష్టిస్తున్న యుద్ధాల కంటే అత్యంత భయంకరమైన, నిశ్శబ్ద యుద్ధం ఒకటి అంతర్జాతీయ ఆర్థిక రంగంలో మొదలైంది. తుపాకులు, క్షిపణుల మోత లేకుండానే అమెరికా సామ్రాజ్యాన్ని గద్దె దించేందుకు కొన్ని దేశాలు వేసిన వ్యూహం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. ఈ సంచలన మార్పుపైనే ప్రముఖ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధం కంటే, అమెరికా డాలర్‌కు పొంచి ఉన్న ముప్పే అత్యంత ఘోరమైనదని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
అసలు కియోసాకిని ఇంతలా భయపెడుతున్న ఆ పరిణామం ఏమిటి? దానికి సమాధానం... ఇరాన్ దేశం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం. ఇరాన్ తన చమురు (Crude Oil) విక్రయాల కోసం అమెరికా డాలర్ స్థానంలో చైనా కరెన్సీ అయిన 'యువాన్' (Yuan) లో చెల్లింపులను స్వీకరించడం ప్రారంభించింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య జరిగిన వ్యాపార ఒప్పందం కాదు, దశాబ్దాలుగా ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా "పెట్రో డాలర్" (Petro-dollar) వ్యవస్థకు మరణ శాసనం అని కియోసాకి అభివర్ణించారు.

ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం కాస్త చరిత్రలోకి వెళ్లాలి. 1970ల కాలంలో అమెరికా, సౌదీ అరేబియా వంటి చమురు దేశాల మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరింది. ప్రపంచంలో ఎవరు చమురు కొనాలన్నా కేవలం అమెరికా డాలర్లలోనే చెల్లింపులు జరపాలి అనేది ఆ ఒప్పందం సారాంశం. దీనివల్ల చమురు అవసరమైన ప్రతి దేశం తమ సొంత కరెన్సీని పక్కన పెట్టి, అమెరికా డాలర్లను రిజర్వ్‌లుగా దాచుకోవడం మొదలుపెట్టాయి. చమురు వ్యాపారమే డాలర్‌ను 'గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ'గా మార్చింది. దీనినే 'పెట్రో డాలర్' వ్యవస్థ అంటారు. అమెరికా ఆర్థికంగా ఎంత అప్పుల్లో ఉన్నా ప్రపంచాన్ని శాసించడానికి ఈ పెట్రో డాలరే ప్రధాన కారణం.
అయితే, అమెరికా తన ఆర్థిక ఆంక్షల (Sanctions) ఆయుధాన్ని ఉపయోగించి ఇరాన్, రష్యా వంటి దేశాలపై కఠినమైన ఆంక్షలు విధించింది. దీంతో ఆయా దేశాలు డాలర్‌తో పనిలేకుండా వ్యాపారం చేసుకునే 'డీ-డాలరైజేషన్' (De-dollarization) మార్గాన్ని ఎంచుకున్నాయి. ఇందులో భాగంగానే ఇరాన్, చైనా చేతులు కలిపాయి. డాలర్ స్థానంలో చైనా యువాన్‌ను ఇరాన్ అంగీకరించడం అంటే, అమెరికా గుత్తాధిపత్యానికి గట్టి దెబ్బ పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
రాబర్ట్ కియోసాకి తన ట్వీట్‌లో సామాన్యులను ఉద్దేశించి కొన్ని కీలక ప్రశ్నలు వేశారు. ఇరాన్ చమురు కోసం చైనా యువాన్‌ను అంగీకరించడం ప్రారంభించింది. దీని అర్థం ఏమిటి? మీ భవిష్యత్తుపై, అమెరికా డాలర్ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది?" అని ఆయన ప్రశ్నించారు. ఈ అంతర్జాతీయ మార్పుల వల్ల రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం పెరిగి, కరెన్సీ విలువ పడిపోయి సామాన్యులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ సంక్షోభం నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక పరిజ్ఞానాన్ని (Financial Literacy) పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం రోజుకు కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించాలని కోరారు. దురదృష్టవశాత్తూ, ప్రపంచాన్ని మార్చే ఇలాంటి నగ్న సత్యాలను, ముఖ్యమైన విషయాలను మన పాఠశాలల్లో లేదా విద్యావ్యవస్థలో ఎప్పటికీ నేర్పరని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న ఈ భారీ ఆర్థిక సంక్షోభం గురించి ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ రే డాలియో (Ray Dalio) మాత్రమే స్పష్టంగా వివరిస్తున్నారని కియోసాకి పేర్కొన్నారు. రే డాలియో నిర్వహించిన "ఇరాన్ జస్ట్ కిల్‌డ్ ది పెట్రో డాలర్" (ఇరాన్ ఇప్పుడే పెట్రో డాలర్‌ను అంతం చేసింది) అనే పాడ్‌కాస్ట్‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాలని ఆయన సూచించారు. అప్పుడే అంతర్జాతీయంగా జరుగుతున్న ఈ చదరంగం ఆట మనకు అర్థమవుతుందని చెప్పారు.
"మీ జీవితంలో మీరు పెట్టే అత్యుత్తమ పెట్టుబడి... మీ ఆర్థిక విద్యపై పెట్టే పెట్టుబడే" అని కియోసాకి స్పష్టం చేశారు. స్థిరాస్తులు, బంగారం లేదా డిజిటల్ అసెట్స్ వంటి వాటిపై అవగాహన పెంచుకోవడమే ఈ డాలర్ పతనం నుండి మనల్ని కాపాడుతుందని ఈ కథనం ద్వారా స్పష్టమవుతోంది. ప్రపంచంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే కాదు, బ్యాంకులు, కరెన్సీల రూపంలో కూడా జరుగుతాయని ఇరాన్-చైనా ఆర్థిక వ్యూహం నిరూపిస్తోంది.


Click it and Unblock the Notifications
