Gold: క్రమంగా తగ్గుతోన్న బంగారం ధర.. పెట్టుబడికి ఇదే సరైన సమయమా..!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆయన బంగారం, వెండి, బిట్ కాయిన్ల గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు. గతంలో ఆయన బంగారం గురించి చాలా పోస్టులు చేశారు. ఆయన బంగారం ధర పెరిగే అవకాశం ఉందని చాలా రోజుల క్రితమే చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే బంగారం ధర పెరిగింది. అయితే తాజాగా కూడా ఆయన సోషల్ మీడియాలో పలు పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా బంగారానికి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
బంగారం ధర తగ్గడం శుభపరిణామమని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే తాను ప్రస్తుతం బంగారం కొనుగోలు చేసే స్థితికి వచ్చిందా లేదా అని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం సాంకేతిక చార్టులను విశ్లేషిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారం ధర తగ్గుతుంది కదా అని పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ఒక ఇంటి ధర తగ్గిన వెంటనే కొనుగోలు చేయలేమని.. ఆ ఇంటి వాస్తు, అందులో ఉన్న వసతులు, చుట్టు ప్రక్కల ప్రాంతం ఎలా అభివృద్ధి చెందిందో చూస్తామని తెలిపారు. బంగారం కూడా అంతేనని వివరించారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడం ముఖ్యమన్నారు.

ఒకవేళ ఆర్థిక పరిస్థితులు బలహీనపడుతుంటే పసిడి కొనుగోలుకు దూరంగా ఉంటే బెటరని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ కాస్త ఆశాజనకంగానే ఉందని బంగారం కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు. తన వద్ద ఉన్న ఎక్కువ శాతం బంగారాన్ని 2000 సంవత్సరం లో ఔన్సుకు దాదాపు 300 డాలర్ల వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. కాగా దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి కొనసాగుతుందనే అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి.
24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2780 తగ్గి రూ.1,40,130 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2550 తగ్గి రూ.1.28,450 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధర తగ్గినప్పటికీ ఇంకా ఎక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.లక్షకు తగ్గితే తగ్గినట్లని చెబుతున్నారు. కానీ ఆ స్థాయిలో తగ్గాలంటే సమయం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications