Gold: బంగారం ధర తగ్గితే కొనుగోలు చేయాలా.. రాబర్ట్ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు..!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకర రచయిత, ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఆర్థిక అంశాలపై ఫాలోవర్స్ సూచన చేస్తూనే ఉంటారు. ఆయన స్టాక్ మార్కెట్, బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ గురించి పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన బంగారం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీవీ, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్లు వస్తే కొనుగోలుదారులు ఎగబడతారని, అదే బంగారం ధర గరిష్ఠ స్థాయి నుంచి 25 శాతం తగ్గితే మాత్రం భయపడి పెట్టుబడుల నుంచి వెనక్కి తగ్గుతారని చెప్పారు. సంపదను పెంచుకోవడానికి కొనుగోలు చేసే ఆస్తుల ధరలు తగ్గినప్పుడు కూడా వాటిని చూసే విధానంలో మార్పు రావాలని తెలిపారు.
రిటైల్ కొనుగోలుదారులు టీవీపై 10 శాతం తగ్గింపు వస్తే సుమారు 40 డాలర్లు ఆదా చేసేందుకు ఆసక్తి చూపిస్తారని కియోసాకి ఉదాహరణగా చెప్పారు. అయితే, బంగారం ధర 25 శాతం పడిపోయినప్పుడు మాత్రం దానిని ప్రమాదకరమైన పెట్టుబడిగా భావించి విక్రయించేందుకు ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. ధర తగ్గిందనే కారణంతోనే ఒక పెట్టుబడిని మంచిదని నిర్ణయించలేమని, అదే సమయంలో ధర తగ్గిందని మాత్రమే దాని నుంచి దూరంగా ఉండటం కూడా సరైన విధానం కాదని విశ్లేషించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనాలను ప్రస్తావిస్తూ కియోసాకి తన అభిప్రాయాలను వెల్లడించారు.

2026 నాలుగో త్రైమాసికంలో బంగారం ధర ఔన్స్‌కు 4,000 డాలర్ల స్థాయి వద్ద ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. అయితే 2027 రెండో, మూడో త్రైమాసికాల్లో అదే బంగారం ధర ఔన్స్‌కు 5,000 డాలర్లకు చేరవచ్చని అంచనా ఉన్నట్లు ఆయన వివరించారు. బంగారం ధరలు పడిపోయినప్పుడు పెట్టుబడిదారులు ఆందోళన చెందకుండా, ధరల తగ్గుదలకు గల కారణాలను విశ్లేషించాలని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. బంగారం కొనుగోలు చేయడానికి గతంలో ఉన్న దీర్ఘకాలిక కారణాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయా? మార్కెట్ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? అనే అంశాలను పరిశీలించాలని సూచించారు.
కేవలం ప్రతికూల వార్తలు చూసి నిర్ణయాలు తీసుకోవడం కంటే, పెట్టుబడి వెనుక ఉన్న ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని వివరించారు. రాబోయే 12 నెలల్లో బంగారం ధర ఔన్స్‌కు 10,000 డాలర్లకు చేరవచ్చనే అంచనా వేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications