డబ్బు చాలా డేంజర్.. దాని కన్నా విలువైనది ఏంటో చెబుతున్న రాబర్ట్ కియోసాకి.. భారతీయ గురువుపై ప్రశంసలు..
ప్రముఖ వ్యక్తిగత ఆర్థిక పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి.. కేవలం డబ్బు సంపాదనకే పరిమితం కాకుండా జీవితంలో ఒక ఉన్నతమైన ఆశయాన్ని, ఆత్మ యొక్క నిజమైన లక్ష్యాన్ని కనుగొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. ఆర్థిక విజయం అనేది జీవితానికి అంతిమ పరమార్థం కాకూడదని, అది ఒక ఉన్నతమైన ధ్యేయం నుండి పుట్టాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కియోసాకి సంవత్సరాల క్రితం ఒక భారతీయ గురువు నుండి తాను నేర్చుకున్న ఒక అమూల్యమైన పాఠాన్ని గుర్తుచేసుకున్నారు. మీ ఆత్మ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడమే మీ శరీరం యొక్క లక్ష్యం అనేదే ఆ పాఠం. ఆ సమయంలో తన శరీరం కేవలం డబ్బు సంపాదించడంలోనే నిమగ్నమై ఉండేదని.. కానీ తన ఆత్మ యొక్క నిజమైన లక్ష్యం ఏమిటో అర్థం చేసుకోవడానికి తనకు చాలా సంవత్సరాల సమయం పట్టిందని ఆయన అంగీకరించారు. చిన్నతనంలో పాఠశాల విద్యలో ఇబ్బందులు పడటం, లాంఛనప్రాయమైన చదువులంటే ఇష్టం లేకపోవడం వల్ల బోధన అనేది తాను అస్సలు ఊహించని రంగమని, కానీ చివరికి ఇతరులకు నేర్పించడమే తన జీవిత లక్ష్యమని గ్రహించానని చెప్పారు.

ప్రస్తుత విద్యావ్యవస్థ పాఠశాలల్లో డబ్బుకు సంబంధించిన విషయాలపై ప్రజలకు అబద్ధాలు చెబుతోందని కియోసాకి బలంగా నమ్ముతారు. ఆ దృఢ విశ్వాసంతోనే 50 ఏళ్ల క్రితం ఆయన ఒక తయారీదారుగా (మాన్యుఫ్యాక్చరర్) ఉండటం మానేసి, తన రిచ్ డాడ్ (ధనవంతుడైన తండ్రి) నుండి నేర్చుకున్న ఆర్థిక పాఠాలను ఇతరులకు బోధించడం ప్రారంభించారు. ఆ ఒక్క నిర్ణయమే తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని ఆయన పేర్కొన్నారు.
చాలా మంది కేవలం బ్రతకడం కోసం, డబ్బు కోసం నిరంతరం శ్రమించడంలోనే మునిగిపోయి, తమ జీవిత పరమార్థాన్ని కనుగొనడంలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బదులుగా, మానవాళికి సేవ చేయడానికి నా హృదయం ఏం చేయాలనుకుంటోందని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలని, ఎలాంటి ఆర్థిక ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆ పిలుపును అనుసరించాలని పాఠకులను ప్రోత్సహించారు.
మొదట్లో తాను ఈ ఆర్థిక పాఠాలను ఉచితంగా బోధించడం ప్రారంభించినప్పుడు.. డబ్బును పొదుపు చేసేవారు నష్టపోతారు, అప్పు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది వంటి తన భిన్నమైన ఆలోచనల కారణంగా ఎందరో ఎగతాళి చేశారని కియోసాకి గుర్తుచేసుకున్నారు. కానీ కాలక్రమేణా.. ఆ ఉచిత విద్యే ప్రపంచవ్యాప్త పరిధితో కోట్లాది డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌ను ఉదహరిస్తూ.. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే తన లక్ష్యమని, తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా కింగ్ వెనకడుగు వేయలేదని కొనియాడారు. చివరగా మీ ఆత్మ యొక్క ధ్యేయమేమిటి అనే ఒక ప్రాథమిక ప్రశ్నపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుతూ ఆయన తన పోస్ట్‌ను ముగించారు.
ఏప్రిల్ 8, 1947న హవాయిలోని హిలోలో పుట్టిన రాబర్ట్ టోరు కియోసాకి.. జపనీస్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి రాల్ఫ్ కియోసాకి ఒక విద్యావేత్త కాగా, తల్లి మార్జోరీ కియోసాకి ఒక నర్సు. ఆయన నలుగురు పిల్లలలో పెద్దవాడు. ఆయన సోదరీమణులలో ఒకరైన టెన్జిన్ కాచో, స్వయంగా దలైలామా చేత బౌద్ధ సన్యాసినిగా దీక్ష పొంది, కాలిఫోర్నియాలోని ఒక బౌద్ధ కేంద్రంలో సేవలు అందిస్తున్నారు. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన కియోసాకి, తన ఆలోచనలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆర్థిక పాఠాలు నేర్పిన పారిశ్రామికవేత్తగా, రచయితగా గుర్తింపు పొందారు.


Click it and Unblock the Notifications
