పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర చమురు శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం స్పందించారు. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులకు సమస్యేనని, కానీ ప్రస్తుతం తగ్గే పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బులను సేవ్ చేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ధరలు తగ్గే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఇటీవల పెట్రోల్ ధరలు దేశంలోని పలు రాష్ట్రాల్లో రూ.100 దాటింది. ఇది సామాన్యులకు ఇబ్బందికరంగా మారింది.

ధరలు ఇబ్బందికరమే...
'ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇబ్బందికరమే. అయితే కరోనా వ్యాక్సినేషన్ పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి దాదాపు రూ.35,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో సంక్షేమ పథకాలపై ఖర్చుల కోసం డబ్బులు సేవింగ్ చేయవలసి వస్తోంది' అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రేషన్ ఉచితంగా ఇవ్వడం కోసం రూ.1 లక్ష కోట్ల మేరకు ఖర్చు చేస్తోందని, ఈ ఉచిత రేషన్ ఎనిమిది నెలల పాటు ఇస్తోందని తెలిపారు. అలాగే పీఎం కిసాన్ యోజన కింద నేరుగా నేరుగా బ్యాంకు అకౌంట్లలో రైతులకు డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు.

వారితో మాట్లాడండి
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై విమర్శలు గుప్పించారు. దీనిపై కూడా ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఇంధన ధరల పెరుగుదలపై ఆయన మాట్లాడడానికి ముందు రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మహారాష్ట్రలో కాంగ్రెస్ అలయెన్స్ ప్రభుత్వం ఉందని, అక్కడి ముఖ్యమంత్రులతో మాట్లాడాలని సూచించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ధరలు తగ్గించాలని సూచించాలని హితవు పలికారు.

రూ.100 క్రాస్
పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత ఆరు వారాల్లోనే లీటర్ పెట్రోల్ ధరపై రూ.5.72, లీటర్ డీజిల్ పైన రూ.6.25 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో పాటు దేశీయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల కారణంగా ధరలు పెరిగాయి. దీంతో పలు నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటింది.


Click it and Unblock the Notifications