Ambani News: గంటల్లో రూ.లక్ష కోట్లు సంపాదించిన అంబానీ.. వివరాలివే..
RIL Stock: నేడు అనుహ్యంగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరును కొనసాగించటం ఆసియా సంపన్నుడిగా, ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీకి కలిసొచ్చింది.
ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు మార్కెట్ల ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ క్రమంలో ఇంట్రాడేలో రిలయన్స్ స్టాక్ గరిష్ఠంగా 7 శాతానికి పైగా లాభపడింది. దీంతో తొలిసారిగా 2020 సెప్టెంబర్ తర్వాత భారీగా పెరిగిన రిలయన్స్ స్టాక్ వల్ల కంపెనీ మార్కెట్ క్యాప్ సరికొత్త గరిష్ఠమైన రూ.19.5 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఒక్కరోజులోనే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.లక్ష కోట్ల మేర పెరిగింది.

రిలయన్స్ షేర్లు పెట్టుబడిదారులకు అందించిన లాభాలను పరిశీలిస్తే.. జనవరి మాసంలో ఏకంగా 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే డిసెంబరులో 9 శాతం, నవంబరులో 4 శాతం మేర పెరుగుదలను నమోదు చేసింది. 2015 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది రిలయన్స్ స్టాక్ స్థిరంగా వృద్ధి చెందుతూ పెట్టుబడిదారులకు లాభాల ఆనందాలను పంచుతోంది. నేడు మధ్యాహ్నం 2.55 గంటల సమయంలో ఆర్ఐఎల్ షేర్ ధరను పరిశీలిస్తే.. ఎన్ఎస్ఈలో 6.99 శాతం పెరిగి రూ.2,895 వద్ద కొనసాగుతోంది. అలాగే ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.2,904 రేటును తాకింది.
ఒకప్పుడు ప్రధానంగా చమురు వ్యాపారంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ వ్యాపారాలను విస్తరించాలని నిర్ణయించిన తర్వాత.. రిటైల్, టెలికాం, ఓటీటీ, ఫైనాన్షియల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఫ్యాషన్, జ్యూవెలరీ వంటి ఇతర అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. దీనికి తోడు రిలయన్స్ గ్రూప్ అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వాటితో కలిసి టెక్నాలజీ వృద్ధితో వేగంగా ముందుకు సాగుతోంది. రానున్న కాలంలో కూడా రిలయన్స్ గ్రూప్ ఇదే దూకుడును కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications