Uber News: రవాణా రంగంలో రైడ్-హెయిలింగ్ సంస్థల అరంగేట్రంతో ప్రజల ఇబ్బందులు చాలా వరకు తగ్గాయని చెప్పుకోవాలి. సాంప్రదాయ రవాణా వ్యవస్థలకు భిన్నంగా ఇవి కస్టమర్లు ఉన్న చోటుకు వచ్చి వారిని గమ్యస్థానాలకు చేర్చటం ప్రారంభించాక పెను మార్పు మెుదలైంది. ప్రధానంగా పట్టణాల్లో ఇది చాలా ఆధరణ పొందింది.
ఈ క్రమంలో ప్రఖ్యాత రైడ్-హెయిలింగ్ యాప్ ఉబెర్ ఒక మోసానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీని ప్రకారం రైడ్ బుక్ చేసుకునే సమయంలో వినియోగదారుని స్మార్ట్‌ఫోన్ తక్కువ బ్యాటరీ ఛార్జింగ్ కలిగి ఉన్నట్లయితే వారికి రైడ్ ధరలను పెంచుతుందని అనేక మంది ఆరోపించారు. దీనికి సంబంధించి ఒక వినియోగదారుడు చేపట్టిన ప్రయోగం ఆశ్చర్యకరమైన ఫలితాలను వెలుగులోకి తెచ్చింది.

బ్రస్సెల్స్‌లోని వినియోగదారులు దీనిని గమనించిన తర్వాత.. బెల్జియన్ దినపత్రిక డెర్నియెర్ హ్యూర్ వేర్వేరు బ్యాటరీ ఛార్జింగ్ స్థాయిలు కలిగి ఉన్న రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి టెస్ట్ చేసింది. ఇందులో రైడ్ ధరల్లో కనిపించిన గణనీయమైన మార్పులను గుర్తించింది. 84 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఉన్న ఫోన్ ద్వారా రైడ్ కంటే 12 శాతం ఛార్జింగ్ కలిగిన స్మార్ట్ ఫోన్ వినియోగించినప్పుడు ఒకే గమ్యస్థానానికి ప్రయాణించేందుకు 0.96 యూరోలు అధికంగా వసూలు చేస్తున్నట్లు తేలింది.
ఇదే విషయంపై ఉబెర్ క్లారిటీ ఇస్తూ.. బ్యాటరీ స్థాయిలు ధరపై ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉండవని తెలిపింది. నిర్థిష్ట ప్రాంతంలో అందుబాటులో ఉన్న డ్రైవర్ల సంఖ్య, డిమాండ్, సరఫరా వంటి కారణాల ప్రకారం డైనమిక్ ధర నిర్ణయించబడుతుందని వెల్లడించింది. తక్కువ బ్యాటరీ ఛార్జింగ్ కలిగి ఉన్న వినియోగదారులు అధిక ధరలను అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉందని కంపెనీ కనుగొన్నట్లు 2016లో Uber మాజీ ఎకనామిక్ రీసెర్చ్ హెడ్ కీత్ చెన్ వెల్లడించారు. అయితే కంపెనీ ఉద్దేశపూర్వకంగా ధరలను పెంచుతోందనే ఆరోపణలను ఆయన ఖండించారు.
ఈ క్రమంలో ఉబెర్ తన యూజర్లకు రైడ్ బుకింగ్ కి ముందే అంచనా ఛార్జీలను చూపిస్తుంది. అయితే ఇది సుదీర్ఘమైన, తక్కువ సమర్థవంతమైన మార్గాన్ని ఉపయోగించి లెక్కిస్తుంది. దీని ఫలితంగా ప్రయాణికులకు ఎక్కువ ఖర్చవటంతో పాటు డ్రైవర్‌లు రైడ్ కోసం తక్కువ డబ్బును అందుకుంటారు. గత ఏడాది కర్ణాటక ప్రభుత్వం ఆటో అగ్రిగేటర్లు అధిక ధరలను వసూలు చేస్తున్నారంటూ బ్యాన్ విధించటంతో అప్పుడు ఉబెర్ తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.


Click it and Unblock the Notifications