Robert Kiyosaki నిజంగా అప్పుల్లో కూరుకుపోయారా.. 1.2 బిలియన్ డాలర్ల రుణం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే..
ప్రపంచవ్యాప్త బెస్ట్ సెల్లర్ "రిచ్ డాడ్ పూర్ డాడ్" పుస్తకంతో కోట్ల మందికి ఆర్థిక సూత్రాలు బోధించిన ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త Robert Kiyosaki మళ్లీ వార్తల్లో నిలిచారు. తనకు ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 10,000 కోట్లకు పైగా) అప్పు ఉందంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయ ఆర్థిక వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
79 ఏళ్ల వయసున్న కియోసాకి స్వయంగా ఈ రుణ పరిమాణాన్ని పదేపదే ప్రస్తావించడం, 'గెట్ రిచ్ ఎడ్యుకేషన్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ వేసవిలో తన అప్పు ఏకంగా 2 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు పేర్కొనడం ఆర్థిక నిపుణులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే కోట్ల డాలర్ల రుణ భారం వినడానికి ఎంత ప్రమాదకరంగా అనిపిస్తుందో, దాని వెనుక ఉన్న పన్ను వ్యూహం అంత సంక్లిష్టమైనదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ది న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. వానిటీ ఫెయిర్‌తో కియోసాకి మాజీ భార్య, వ్యాపార భాగస్వామి కిమ్ కియోసాకి మాట్లాడారు. ఈ 1.2 బిలియన్ డాలర్ల రుణం రాబర్ట్ కియోసాకి ఒక వ్యక్తిగా చెల్లించాల్సిన బాధ్యత కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ దంపతులు, వారి పెట్టుబడి భాగస్వాములు కలిసి సుమారు 1,500 అపార్ట్‌మెంట్ యూనిట్లతో కూడిన భారీ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నారు. ఈ ఆస్తుల కొనుగోలు, నిర్వహణ కోసం తీసుకున్న రుణాలను వివిధ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీల (LLC) ద్వారా పంచుకున్నారు. ఈ మొత్తం రుణంలో కియోసాకి యొక్క వ్యక్తిగత వాటా కేవలం 30 మిలియన్ డాలర్ల నుండి 60 మిలియన్ డాలర్ల (రూ. 250 కోట్ల నుండి రూ. 500 కోట్లు) మధ్య మాత్రమే ఉంటుందని అంచనా వేసింది.
రాబర్ట్ కియోసాకి దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్న ప్రధాన ఆర్థిక తత్వం ప్రకారం, అప్పును భయంకరమైనదిగా భావించకుండా, ఆదాయాన్నిచ్చే ఆస్తులను కొనడానికి రుణాన్ని ఒక సాధనంగా ఉపయోగించాలి. ఈ వ్యూహంలో భాగంగా కియోసాకి తన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువ పెరిగినప్పుడు, ఆ పెరిగిన విలువ ఆధారంగా బ్యాంకుల నుండి అదనపు రుణాలు తీసుకుంటారు. సాధారణంగా లభించే ఆదాయంపై అధిక శాతం ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది, కానీ బ్యాంకుల నుండి తీసుకునే రుణాలపై పన్నులు వర్తించవు. ఈ పన్ను రహిత రుణ సొమ్ముతో ఆయన మరిన్ని ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆ ఆస్తుల నుండి వచ్చే అద్దె ఆదాయంతోనే బ్యాంకు రుణాల ఈఎంఐలు, వడ్డీలు చెల్లిస్తుంటారు.
కియోసాకి వ్యూహం భారీ స్థాయి పెట్టుబడిదారులలో సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, ఆర్థిక నిపుణులు దీనిపై తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ డేవిడ్ ఎ. పెరెజ్ మాట్లాడుతూ, ఆస్తి ఈక్విటీ ఆధారంగా పదేపదే అదనపు రుణాలు తీసుకోవడం వల్ల నెలవారీ తనఖా చెల్లింపులు, వడ్డీ భారం గణనీయంగా పెరుగుతాయని, ఇది నికర నగదు ప్రవాహాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. స్కాట్స్‌డేల్‌కు చెందిన కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు జాన్ పూల్ ఈ నమూనాను "ఆర్థికంగా విరుచుకుపడే చైన్‌సా" తో పోల్చారు.
మంచి అప్పు, చెడ్డ అప్పు అనే వ్యత్యాసం ఉన్నప్పటికీ, నిరవధికంగా భారీ రుణ భారంపైనే ఆధారపడి ఉండటం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయినా లేదా అద్దె ఆదాయం తగ్గినా కియోసాకి తీవ్రమైన విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 1997లో ప్రచురితమై ప్రపంచవ్యాప్తంగా 4.4 కోట్ల కాపీలు అమ్ముడైన "రిచ్ డాడ్ పూర్ డాడ్" ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన కియోసాకి, తన శ్రోతలను తన పద్ధతిని గుడ్డిగా అనుకరించవద్దని హెచ్చరించడం ఇక్కడ గమనార్హం.


Click it and Unblock the Notifications
