దేశ రాజధానిలో కొనసాగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ రెండో రోజు కీలక చర్చలతో ఉత్సాహంగా సాగింది. ఈ సమావేశంలో ప్రసంగించిన నీతి అయోగ్ మాజీ ఛైర్మెన్ Amitabh Kant కృత్రిమ మేధస్సు (AI) వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాలు నశిస్తాయన్న ఆందోళనలను స్పష్టంగా ఖండించారు. చరిత్రలో జరిగిన ప్రతి సాంకేతిక విప్లవం ప్రారంభంలో భయాలను కలిగించినప్పటికీ.. అవి చివరికి కొత్త తరహా ఉపాధి అవకాశాలను సృష్టించాయని గుర్తు చేశారు. AI కూడా అదే మార్గంలో సాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన భారతదేశ AI ఆశయాలు మూడు కీలక స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని వివరించారు. అవి ఏంటంటే ప్రతిభ (Talent), నైపుణ్యాభివృద్ధి (Skills), కంప్యూటింగ్ శక్తి (Compute Power). ఈ మూడు సమానంగా కీలకమని, ముఖ్యంగా మానవ మూలధనంచ డిజిటల్ మౌలిక సదుపాయాల్లో నిరంతర పెట్టుబడులు అవసరమని కాంత్ స్పష్టం చేశారు. యువ జనాభా, సాంకేతిక ప్రతిభ భారతదేశానికి ఉన్న గొప్ప బలమని, వాటిని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచ AI రంగంలో భారత్ నాయకత్వం సాధించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆటోమేషన్ కారణంగా నిరుద్యోగం పెరుగుతుందన్న వాదనలను తిరస్కరిస్తూ.. ఏ సాంకేతికత కూడా ఉద్యోగాలను పూర్తిగా తొలగించదు. అవి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయి కానీ వేరే రకమైనవిగా అని కాంత్ అన్నారు. పరిశ్రమలు సాంకేతికతతో పాటు అభివృద్ధి చెందుతున్నప్పుడు డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్ నిపుణులు, AI ఇంజినీర్లు వంటి అధునాతన నైపుణ్యాలకు డిమాండ్ భారీగా పెరుగుతుందని వివరించారు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా AI రంగంలో జరుగుతున్న భారీ పెట్టుబడులు కొద్ది కార్పొరేషన్లు లేదా కొన్ని దేశాలకే పరిమితమైతే ప్రమాదకర పరిణామాలు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. నియంత్రణ లేని AI వృద్ధి ఆర్థిక, సామాజిక అసమానతలను మరింత పెంచుతుందని పేర్కొంటూ.. మనమొక అసమాన సమాజాన్ని సృష్టిస్తే అది విజయం కాదు-వైఫల్యం అని కఠిన వ్యాఖ్యలు చేశారు.
AI విజయాన్ని కొద్ది పెద్ద టెక్ కంపెనీల మార్కెట్ విలువ పెరుగుదలతో కొలవడం సరైంది కాదని కాంత్ స్పష్టం చేశారు. నిజమైన విజయం అంటే ప్రత్యేకంగా గ్లోబల్ సౌత్ దేశాల్లో ప్రజల జీవితాలను AI ఎంత మేరకు మెరుగుపరుస్తుందన్నదేనని అన్నారు. అందుకోసం AI సాధనాలు, మౌలిక సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలని, సమ్మిళిత వ్యవస్థలు అవసరమని సూచించారు.
ప్రపంచ AI పర్యావరణంలో భారతదేశం పెరుగుతున్న పాత్రను ప్రస్తావిస్తూ, డేటా వినియోగంలో భారత్ కీలకంగా మారిందని కాంత్ గుర్తు చేశారు. OpenAI, ChatGPT లను పరిశీలిస్తే, యునైటెడ్ స్టేట్స్ కంటే భారత్ సుమారు 33 శాతం అధిక డేటాను అందిస్తున్నదని ఆయన తెలిపారు. ఇది గ్లోబల్ AI అభివృద్ధిలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతున్నదానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఈ చర్చలో పాల్గొన్న ఇతర నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధి Amandeep Singh Gill మాట్లాడుతూ, అసలు సంఘర్షణ నియంత్రణ, ఆవిష్కరణల మధ్య కాదని, AIని వినియోగించగలవారు, వినియోగించలేని వారిమధ్యే నిజమైన విభజన ఉందని చెప్పారు. కొన్ని దేశాలు వెనుకబడితే తీవ్ర అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఆయన ఏమంటున్నారంటే.. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని కాంత్ సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాల్లో వేగవంతమైన వృద్ధి జరిగినప్పటికీ అసమానతలు పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, అదే ప్రమాదం ఇప్పుడు AI విప్లవం ముందున్నదని అన్నారు. సరైన విధానాలు, నైపుణ్యాభివృద్ధి, సమాన వృద్ధితో AIను ముందుకు తీసుకెళ్లగలిగితే, అది మానవ అభివృద్ధికి శక్తివంతమైన సాధనంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications