LIC Revive policy: గుడ్‌న్యూస్, ఆగిపోయిన పాలసీల పునరుద్ధరణకు స్కీం
జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీమియం చెల్లించనందున, రద్దయిన పాలసీలను తిరిగి అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ పేరుతో ఆగస్ట్ 23వ తేదీన దీనిని ప్రారంభించింది. అక్టోబర్ 22వ తేదీ వరకు ఈ పాలసీ కొనసాగుతుంది. గత అయిదేళ్లుగా ప్రీమియం చెల్లించకుండా ఉన్న పాలసీలను పునరుద్ధరణ చేసుకునేందుకు ఈ పథకంతో వెసులుబాటు కలుగుతుందని ఎల్ఐసీ తెలిపింది. ప్రీమియం చెల్లింపుకు వీలు కలిగి, ఇంకా వ్యవధి ఉన్న పాలసీలను కొన్ని నిబంధనల మేరకు మళ్లీ అమల్లోకి తీసుకు రావొచ్చు. చెల్లించాల్సిన ప్రీమియాలకు ఆలస్యపు ఛార్జీలో కొంత రాయితీ ఇస్తోంది ఎల్ఐసీ. టర్మ్ పాలసీలకు, అధిక రిస్క్ ఉన్న పాలసీలకు మాత్రం ఈ రాయితీ వర్తించదు. ఆరోగ్య పరీక్షల విషయంలో మినహాయింపు లేదు.

నెల రోజుల స్కీం
ఎల్ఐసీ పాలసీ పునరుద్ధరణ స్కీంలో భాగంగా రూ.1 లక్ష లోపు ప్రీమియం చెల్లించే వారికి లేట్ ఫీజులో 20 శాతం రాయితీ ఉంటుంది. అయితే గరిష్ట పరిమితి రూ.2000. రూ.1 లక్ష నుండి రూ.3 లక్షల మధ్య ప్రీమియం చెల్లించే వారికి 25 శాతం రాయితీ ఉంది. గరిష్ట పరిమితి రూ.2,500. రూ.3 లక్షలు, ఆ పైన ప్రీమియం చెల్లింపుకు లేట్ ఫీజులో 30 శాతం రాయితీ ఉంటుంది. గరిష్ట రాయితీ పరిమితి రూ.3 లక్షలు. అనివార్య కారణాల వల్ల ప్రీమియాన్ని సకాలంలో చెల్లించని పాలసీదారులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ పునరుద్ధరణ పథకం తోడ్పడుతుందని ఎల్ఐసీ తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కాలంలో పాలసీ మొత్తాన్ని చెల్లించలేక, ఆ పాలసీ ల్యాప్స్ అయితే, ఇప్పుడు దానిని పునరుద్ధరించుకోవాలనుకునే వారికి ఇది ప్రయోజనం. ఈ పాలసీ పునరుద్ధరణ పథకం నెల రోజులు కొనసాగుతుంది.

నిబంధనలివే...
- పాలసీ ల్యాప్స్ అయితే ప్రీమియం చెల్లింపు పాలసీ కాలపరిమితి పూర్తి కాకూడదు.
- టర్మ్ పాలసీలు, మల్టిపుల్ రిస్క్ పాలసీలకు ఈ పునరుద్ధరణ స్కీం వర్తించదు.
- హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీల పునరుద్ధరణకు లేటు ఫీజులో రాయితీ
వైద్య పరీక్షల్లో ఎలాంటి మినహాయింపు ఇవ్వడం లేదు.
- ప్రీమియం బకాయి రూ.1 లక్ష లోపు ఉంటే వారికి లేట్ ఫీజులో 20 శాతం రాయితీ ఉంటుంది. అయితే గరిష్ట పరిమితి రూ.2000.
- ప్రీమియం బకాయి రూ.1 లక్ష నుండి రూ.3 లక్షల మధ్య ప్రీమియం చెల్లించే వారికి 25 శాతం రాయితీ ఉంది. గరిష్ట పరిమితి రూ.2,500.
- రూ.3 లక్షలు, ఆ పైన ప్రీమియం చెల్లింపుకు లేట్ ఫీజులో 30 శాతం రాయితీ ఉంటుంది. గరిష్ట రాయితీ పరిమితి రూ.3 లక్షలు.

ఐపీవో.. ప్రజంటేషన్
ఇదిలా ఉండగా, ఎల్‌ఐసీ ఐపీఓ నిర్వహించేందుకు 16 మర్చంట్ బ్యాంకర్స్ రేసులో ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో ఏడు విదేశీ సంస్థలు, 9 దేశీయ సంస్థలు. ఆగస్ట్ 24, 25 తేదీల్లో దీపమ్ ముందు ఈ సంస్థలు తమ ప్రతిపాదనలు ఇస్తాయి. విదేశీ బ్యాంకర్లలో బీఎన్‌పీ పరిబాస్, సిటీ గ్రూప గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, డీఎస్పీ మెరిల్లించ్, గోల్డ్‌మన్ శాక్స్ సెక్యూరిటీస్, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్&కేపిటల్ మార్కెట్స్, జేపీ మోర్గాన్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్‌లు మంగళవారం ప్రజంటేషన్ ఇస్తాయి. బుధవారం నాడు తొమ్మిది దేశీయ మర్చంట్ బ్యాంకర్లు ప్రజంటేషన్ ఇస్తాయి. ఇందులో యాక్సిస్ కేపిటల్, డీఏఎం కేపిటల్ అడ్వైజర్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్, కోటక్ మహీంద్రా కేపిటల్, ఎస్బీఐ కేపిటల్ మార్కెట్, యెస్ సెక్యూరిటీస్ ఇండియా ఉన్నాయి.


Click it and Unblock the Notifications