EPFO: ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. వారికి పెద్ద ఊరటనిచ్చే వార్తను ప్రకటించింది. వయో భారం కారణంగా అనేక మంది లైఫ్ సర్టిఫికెట్ అందించేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయం దాదాపు 73 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనకరంగా ఉండనుంది.

లక్షల మంది పెన్షనర్లకు..
రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO శనివారం చేసిన ప్రకటన ప్రకారం, పెన్షనర్లు ఎక్కడి నుండైనా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించవచ్చు. ఫింగర్ ప్రింట్ & ఐరిస్ అందించటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధ పెన్షనర్లకు ఈ ముఖ గుర్తింపు ప్రమాణీకరణ సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

సేవలను మెరుగుపరిచేందుకు..
శుక్రవారం రోజు ట్రస్టీలు తన 231వ సమావేశంలో పెన్షనర్లకు EPFO సేవలను మరింత మెరుగుపరచడం కోసం పెన్షన్ కేంద్రీకృత పంపిణీకి ప్రాథమిక ఆమోదం తెలిపారు. ఇదే క్రమంలో EPFO ఉద్యోగులకు కేడర్‌గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్న EPFO శిక్షణా విధానాన్ని కూడా మంత్రి విడుదల చేశారు. 14,000 మంది సిబ్బందికి ఏటా 8 రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వబడుతుంది.

కస్టోడియన్ గా సిటీ బ్యాంక్..
మూడు సంవత్సరాల పాటు EPFO సెక్యూరిటీల కస్టోడియన్‌గా CITI బ్యాంక్ నియామకాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదించింది. కొత్త కస్టోడియన్ బాధ్యతలు స్వీకరించే వరకు ప్రస్తుత కస్టోడియన్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ పదవీకాలాన్ని పొడిగించే ప్రతిపాదన కూడా ఆమోదించింది.

ఈక్విటీల్లో పెట్టుబడి పెంపుపై..
EPFO ఈక్విటీల్లో పెట్టుబడి పరిమితిని ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 20 శాతానికి పెంచే ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై మరించ చర్చలు జరిపిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఉద్యోగుల ప్రతినిధులతో ఈ విషయంపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications