యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు ఐపీవోలో ఇన్వెస్ట్ చేయవచ్చు
డిజిటల్ పేమెంట్స్ హవా కొనసాగుతోంది. ఆరేళ్ల క్రితం నోట్ల రద్దు తర్వాత నుండి పుంజుకున్న డిజిటల్ పేమెంట్స్, కరోనా తర్వాత మరింత వేగవంతమయ్యాయి. ఎక్కువమంది.. ఎక్కువగా... డిజిటల్ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. వివిధ సంస్థల్లో, పథకాల్లో పెట్టుబడులకు డిజిటల్ చెల్లింపులు సులభమైన మార్గంగా మారిపోయాయి. ఇటీవల స్టార్టప్స్ మొదలు పెద్ద కంపెనీలు తమ ఐపీవోకు నిధులను సమీకరిస్తున్నాయి. ఐపీవోల్లో పెట్టుబడులు పెట్టడానికి సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ పెట్టుబడిదారులు కూడా ముందుకు వస్తున్నారు. ఐపీవోల ద్వారా ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్స్‌లో రిటైల్ పెట్టుబడిదారులు నిధులు పెట్టుబడి పెడుతున్నారు. ఐపీవోలు, కన్వర్టబిలిటీలో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి భారీ ఊరటను కలిగించింది.
వివిధ ఐపీవోలలో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు రూ.5 లక్షల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు జరపవచ్చునని మంగళవారం ఓ సర్క్యులర్‌లో తెలిపింది. వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లు తమ సిండికేట్ మెంబర్, స్టాక్ బ్రోకర్, షేర్ ట్రాన్సుఫర్ ఏజెంట్, రిజిస్ట్రార్‌లకు అందచేసే ఐపీవో బిడ్ కం అప్లికేషన్స్‌లో వారి యూపీఐ ఐడీ వివరాలు ఇవ్వాలని సెబి తెలిపింది.

మే 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఐపీవోలకు ఈ కొత్త గైడ్ లైన్స్ అమల్లోకి వస్తాయి. గత డిసెంబర్ నెలలో ఐపీవోలలో పెట్టుబడులు పెట్టేవారు యూపీఐ ద్వారా జరిపే చెల్లింపుల పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచుతూ నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నది.


Click it and Unblock the Notifications