'ఏం కొనేటట్టులేదు... ఏం తినేటట్టులేదు...' దేశంలో మెజార్టీ ప్రజల పరిస్థితి ఇది. ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో జనం కనీసం నిత్యావసరాలను కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం కూడా చుక్కల్లోకి చేరింది.
కేంద్ర గణాంకాల శాఖ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.35 శాతంగా ఉంది. గడిచిన ఐదేళ్లలో నమోదైన గరిష్ట పెరుగుదల ఇది. కస్టమర్ ప్రైజ్ ఇండెక్స్(సీపీఐ) ఆధారంగా లెక్కించిన ద్రవ్యోల్బణం.. 2019 డిసెంబర్ నాటికి 7.35 శాతంగా ఉంది. అదే 2018 నవంబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతంగా నమోదైంది.

కూరగాయలు.. ప్రధానంగా ఉల్లిగడ్డ ధరలు విపరీతంగా పెరిగిపోవడం అదే సమయంలో పప్పుల ధరలూ చుక్కలనంటడం వల్లే ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్టస్థాయికి చేరింది. 2019 డిసెంబర్ లో కూరగాలయ ధరల్లో పెరుగుదల శాతం 60.5 కాగా, పప్పుధాన్యాలు 15.44 శాతం, మాంసం, చేపల ధర 9.57 శాతం, కోడిగుడ్డు ధరలు 8.79 శాతం పెరిగాయి.
''పెరిగిన ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణం కూడా గరిష్టస్థాయిలో ఉంటుందని, 6 శాతాన్ని మించొచ్చని భావించినప్పటికీ 7.35 శాతానికి పెరగడం గమనార్హమని జియోజిత్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎకనమిస్ట్ దీప్తి మేరీ మాథ్యూ అన్నారు. రిటైల్ రంగంలో ద్రవ్యోల్బణం 6 శాతంలోపే ఉండాలని రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించినప్పటికీ.. దాన్ని మించేలా వాస్తవ గణాంకాలు నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications