Inflation: 15 నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం.. వడ్డీరేట్ల వాతకు లైన్ క్లియర్
Inflation: ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు రిటైల్ ద్రవ్యోల్బణం బ్రేక్స్ వేస్తోంది. దీనిని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే టాలరెన్స్ స్థాయి మించి పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తద్వారా ఈ భారం సామాన్యులపై పడి, ఆయా ఉత్పత్తుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.
కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుల ధరల పెరుగుదలతో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాలరెన్స్ పరిమితి 6 శాతాన్ని దాటుకుని జూలైలో 7.44కు చేరుకుంది. ఇదికాస్తా ఊహించిన దానికంటే త్వరగా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడానికి కారణమవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆహార ఉత్పత్తులు, ఎనర్జీ సెక్టార్లోని అస్థిరత కారణంగా జూలైలో ప్రధాన రిటైల్ ద్రవ్యోల్బణం 4.9 శాతం నుంచి 5.1 మధ్య నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు భావించారు. అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. గతేడాది జూన్, జూలైల్లో ఉన్న 4.87, 6.71 శాతాన్ని దాటి దూసుకుపోయింది. గతేడాది ఏప్రిల్ లో నమోదైన రికార్డు రేంజ్ 7.79 శాతానికి అతి చేరువలో 7.44 వద్ద ఈ జూలైలో స్థిరపడింది.
ఆహార ఉత్పత్తులు ఖరీదైనవిగా మారడంతో.. టోకు ధరల ద్రవ్యోల్బణం జూలైలో వరుసగా నాల్గవసారి -1.36 శాతం వద్ద ప్రతికూల స్థాయిలో కొనసాగింది. 'కూరగాయల ధరల్లో కాలానుగుణ పెరుగుదల ఉన్నప్పటికీ తృణధాన్యాల ద్రవ్యోల్బణమే 13.04 శాతంతో ఆందోళన కలిగిస్తోంది. రుతుపవనాల ఆలస్యం, ఎల్ నినో వల్ల 11 నెలల నుంచి రెండంకెల స్థాయిలోనే ఉంటోంది' అని ఇండియా రేటింగ్స్&రీసెర్చ్ సీనియర్ డైరెక్టర్ సునీల్ కుమార్ సిన్హా తెలిపారు.
వినియోగదారుల ధరల సూచీలో దాదాపు సగం వాటా కలిగిన ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో 4.49 శాతం ఉండగా.. జులైలో రాకెట్ వేగంతో 11.51 శాతానికి దూసుకుపోయింది. జనవరి 2020 నుంచి చూస్తే అత్యధికంగా 13 శాతానికి పైగా ఉంది. మార్కెట్లోకి కొత్త పంటలు రాక, ప్రభుత్వ జోక్యంతో CPI ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చని క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త దీప్తి దేశ్ పాండే అంచనా వేశారు. ప్రస్తుత ఒత్తిడి తాత్కాలికంగానే కనిపిస్తోందన్నారు.


Click it and Unblock the Notifications