Retail Inflation: గడచిన ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగి 7 శాతానికి చేరుకుంది. కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వంటి ఆహార పదార్థాల ధరల పెరుగుదల ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. అంతకు ముందు జూలైలో ఇది 6.71 శాతంగా ఉంది. గత సంవత్సరం ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉంది.

భిన్నంగా పరిస్థితులు..
హోల్ సేల్ ధరల సూచీ తగ్గుదలను చూసి ధరలు అదుపులోకి వస్తున్నాయని అందరూ భావించారు. కానీ ఆ ఆలోచన అందరికీ ప్రస్తుతం నిరాశనే మిగిల్చింది. మరోవైపు బుధవారం నాటి గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారంగా ద్రవ్యోల్బణం 12.9 శాతానికి తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. అంటే వరుసగా మూడో నెల కూడా ఇది తగ్గుముఖం పట్టవచ్చని భావిస్తున్నారు.

రేట్లు పెంచిన కంపెనీలు..
గత ఏడాది ఏప్రిల్ నుంచి టోకు ధరలు రెండంకెల స్థాయికి చేరుకోవటంతో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచాయి. అప్పట్లో చాలా కంపెనీలు లాభాలను కోల్పోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ITC సహా అనేక ఎఫ్ఎమ్సీజీ కంపెనీలు ఈ క్రమంలో ధరలను పెంచాయి. మారుతీ, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీలు సైతం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఆదాయాల్లో నష్టాలను నమోదు చేశాయి.

లాభాల భర్తీ కోసం..
ఇంతకు ముందు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న సమయంలో అధిక ఇన్‌పుట్ కాస్ట్స్, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాల కారణంగా ధరలను పెంచాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో రేట్లు తగ్గుతున్నా.. మార్జిన్లను పునరుద్ధరించుకునే క్రమంలో రిటైల్ వినియోగదారులకు తగ్గింపులను అందించటం లేదు.

యూఎస్ ఫెడ్ నిర్ణయాలతో..
మాంద్యం భయాలు పెరిగిన నేపథ్యంలో యూఎస్ ఫెడ్ కఠిన వైఖరి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో వస్తువుల ధరలు దిగివచ్చాయని నిపుణులు చెబుతున్నారు. టోకు ధరల సూచీ పడిపోతే కంపెనీలు తమ మార్జిన్‌లను ఆఫ్‌సెట్ చేయడానికి తక్కువ ఇన్‌పుట్ ధరను ఉపయోగిస్తాయని నోమురా హోల్డింగ్స్ ఇంక్ ఆర్థికవేత్త సోనాల్ వర్మ చెప్పారు

రిజర్వు బ్యాంక్ రేట్లు తగ్గిస్తుందా..?
ఈ నెల 28-30 తేదీల్లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం మార్కెట్లకు చాలా కీలకం కానుంది. ద్రవ్య విధానాన్ని పరిశీలిస్తున్నప్పుడు, RBI ప్రధానంగా వినియోగదారు ధరల సూచిక ఆధారంగా ద్రవ్యోల్బణ రేటును పరిగణనలోకి తీసుకుంటుంది. వరుసగా ఎనిమిది నెలల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం పరిమితికి మించి ఉండటంతో ఈ సారి కూడా వడ్డీ రేట్లు పెంపు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఇది తక్కువగా ఉంటుందా లేక భారీగా పెరుగుతుందా అనేది చర్చనీయాశంగా మారింది.


Click it and Unblock the Notifications