Inflation: నాలుగు నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం.. ఇప్పటికీ భయపెడుతున్న ఫుడ్ ఇండెక్స్
Inflation: ప్రజల ఖర్చుల్లో పెరుగుదల, తగ్గుదలను ద్రవ్యోల్బణంతో లెక్కిస్తారు. ఇటీవల ఆయా ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడంతో.. రిటైల్ ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటే స్థాయికి చేరింది. రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుండటంతో.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంత మెరుగుపడుతోంది.
రిటైల్ ద్రవ్యోల్బణం డేటా తాజాగా విడుదలైంది. అక్టోబరులో ఇది 4 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) గణాంకాలను రిలీజ్ చేసింది. గత నెలలో ద్రవ్యోల్బణం 4.87 శాతానికి తగ్గినట్లు తెలిపింది. అయితే ఆహార ద్రవ్యోల్బణం మాత్రం 6.6 శాతం వద్ద స్థిరంగా ఉన్నట్లు వెల్లడించింది.

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలని రిజర్వ్ బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. పరిస్థితుల ప్రభావం వల్ల +/- 2 శాతాన్ని గరిష్ఠ రేంజ్ గా నిర్ణయించింది. అయితే దాదాపు గత నాలుగేళ్లుగా ద్రవ్యోల్బణం 4 శాతానికి పైనే కొనసాగుతూ వస్తోంది. పెరుగుతూ పోతున్న ఆహార ద్రవ్యోల్బణం.. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ (CFPI) సెప్టెంబర్‌లో 6.62 శాతం కాగా.. అక్టోబర్‌లో 6.61 శాతంగా నమోదైంది. గతేడాది అక్టోబర్లో ఇది 7.01 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 3.39 శాతం నుంచి అక్టోబర్‌లో 2.7 శాతానికి తగ్గడం కొంత ఉపశమనం కలిగించింది. ఆహారేతర, ఇంధనేతర ప్రధాన ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 4.6 శాతం నుంచి 4.4 శాతానికి స్వల్పంగా తగ్గింది. ఇది డిమాండ్ బలహీనతను ప్రతిబింబిస్తున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications