Inflation UP: ప్రస్తుతం చాలా కాలం తర్వాత ద్రవ్యోల్బణం తిరిగి పెరగటం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐకి కొరకరాని కొయ్యగా మారింది. ఇప్పటికే ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు వడ్డీ రేట్ల పెంపు వంచి చర్యలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆశలను ఇది చిదిమేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. జూలై 12న కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆహార పదార్థాల ధరల పెరుగుదల కారణంగా జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి చేరుకుంది. దీనికి ముందు మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం 4.85 శాతంగా నమోదైంది.

జూన్‌లో చాలా ఆహార పదార్థాల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూన్‌లో 9.36 శాతానికి పెరగగా.. అది ఈ ఏడాది మేలో 8.69 శాతంగా ఉంది. గతేడాది జూన్‌లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేటు కేవలం 4.35 శాతంగా ఉంది. జూన్ 2024లో పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల కంటే కొంత మృదువుగా ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. ఈ నెలలో కూరగాయలతో పాటు మాంసం, చేపలు, గుడ్లు, పప్పులు, పాలు, పాలఉత్పత్తులతో పాటు ఇతర నిత్యావసరాల రేట్లు గణనీయంగా పెరిగాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం రెండు శాతం తేడాతో నాలుగు శాతం వద్ద ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాధ్యతను ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. పాలసీ రేట్లను నిర్ణయించేటప్పుడు RBI ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అయితే అనూహ్యంగా వాతావరణ కారణాలతో పడిపోయిన దిగుబడులు ఆహార పదార్ధాల రేట్లను పెంచుతున్నాయి. ఇది ఆర్బీఐని టెన్షన్‌లోకి నెట్టేస్తోంది.


Click it and Unblock the Notifications