RBI MPC Meeting: రిజర్వు బ్యాంక్ ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే మానిటరీ సమావేశం చివరి రోజు నేడు. ఈ క్రమంలో దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత వడ్డీ రేట్లను మార్చాలా..? వద్దా..? అనే నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.
మార్కెట్లలో అందరి నిరీక్షణకు రిజర్వు బ్యాంక్ తెరదించింది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ.
కీలక వడ్డీ రేటైన రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. వరుసగా ఆగస్టులో జరిగిన మూడో సమావేశంలో కూడా రేట్లలో మార్పులు లేకుండా కొనసాగించాలని నిర్ణయించినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ సహేతుకమైన వేగంతో వృద్ధి చెందుతూ.. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచ అభివృద్ధికి దేశ ఆర్థిక వ్యవస్థ సహకారం దాదాపు 15 శాతంగా ఉందని శక్తికాంత దాస్ అన్నారు. ఏప్రిల్ సమావేశానికి ముందు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి మే 2022 నుంచి దశలవారీగా మొత్తం 250 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును రిజర్వు బ్యాంక్ పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 6 సార్లు రేట్ల పెంపును ప్రకటించిన ఆర్బీఐ ద్రవ్యోల్బణంపై ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో రెపో రేటు 4 శాతం నుంచి 6.5 శాతానికి చేరుకుంది.
ఒకపక్క అగ్రరాజ్యం అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రేట్ల పెంపును కొనసాగిస్తూ ముందుకుపోతున్న తరుణంలో భారత సెంట్రల్ బ్యాంక్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించి దేశీయ ప్రజలకు ఊరటను ప్రకటించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల వర్షపాతం తక్కువగా ఉండటం, కొన్ని చోట్ల అధికంగా కురిసిన వానలతో వరదలు కారణంగా ఆహార ధాన్యాల ధరలను పెంచాయని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో మూడు నెలల గరిష్ఠ స్థాయి 4.81 శాతానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications