పండుగ సమయంలో వినియోగదారులకు కాస్త ఊరట. వంట నూనెల ధరలు మరింత తగ్గిస్తున్నాయి. ఇప్పటికే నూనె ధరలు కరోనా సమయంతో పోలిస్తే భారీగా తగ్గాయి. ఓ సమయంలో హోల్‌సేల్ ధరలు కంపెనీని బట్టి రూ.170 నుండి ఆ పైకి వెళ్ళాయి. రిటైల్ ధరలు రూ.రూ.180 దాటాయి. ఇప్పుడు రిటైల్ ధరలే రూ.150 స్థాయికి దిగి వచ్చాయి. అంటే గత ఆరు నెలల కాలంలో వంట నూనెల ధరలు (రిటైల్) రూ.30 వరకు తగ్గాయి. ఈ ధరలు మరికాస్త తగ్గుతున్నాయి. ఈ మేరకు మేజర్ ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కో నూనె పైన రూ.4 నుండి రూ.7 తగ్గించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు అదానీ విల్మర్, రుచి సోయా ఇండస్ట్రీస్ హోల్ సేల్ ధరలను టన్నుకు రూ.4000 నుండి రూ.7000 అంటే కిలోకు రూ.4 నుండి రూ.7కు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. మిగతా కంపెనీలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా, ఢిల్లీ మోదీ నేచరల్స్, సిద్‌పూర్ గోకుల్ రెఫోయిల్స్ అండ్ సాల్వెంట్, అల్వార్ విజయ్ సాల్వెక్స్, అహ్మదాబాద్‌కు చెందిన గోకుల్ అగ్రో రిసోర్సెస్, ఎన్‌కే ప్రోటీన్స్ తదితర సంస్థలు వంట నూనెల హోల్ సేల్ ధరలను తగ్గించాయి.

దీపావళి గిఫ్ట్.. ప్రభుత్వానికి ఒత్తిడి తగ్గుతుంది
ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గిస్తున్నట్లు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(SEA) ప్రకటించిన కాసేపటికే, పలు కంపెనీలు హోల్ సేల్ ధరలను తగ్గించాయి. ధరలు తగ్గించాలని SEA సూచించింది. 'ఇప్పటికే పలు సంస్థలు ధరలను తగ్గించాయి. ఇతర సంస్థలు కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉంది. దీపావళి పండుగ సమయంలో వినియోగదారులకు ఇది బహుమతి. ఈ తగ్గింపు ప్రభుత్వం పైన కూడా కాస్త ఒత్తిడిని తగ్గిస్తుంది' అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నూనె ధరలు పెరగడం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ధరల తగ్గింపు ప్రభుత్వానికి ఊరట అని చెప్పవచ్చు.

కాస్త భారం తగ్గవచ్చు
హోల్ సేల్ ధరలు తగ్గిన నేపథ్యంలో వినియోగదారులకు కూడా కాస్త భారం తగ్గనుందని చెబుతున్నారు. గత వారం పది రోజులుగా ఎడిబుల్ ఆయిల్స్ ధరలు స్థిరంగా ఉన్నాయి. వివిధ కేంద్రాల్లోని కన్స్యూమర్ అఫైర్స్ ప్రకారం సన్ ఫ్లవర్ (కంపెనీ ఆయిల్) రూ.180 నుండి అక్టోబర్ 13వ తేదీ నాటికి రూ.168కి పడిపోయింది. ఆ తర్వాత మరింత తగ్గి రూ.150కి చేరుకుంది. అయితే ఇతర ఎడిబుల్ ఆయిల్స్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి లేదా స్వల్పంగా తగ్గాయి.

పెరిగిన పంట
సోయాబీన్, వేరుశనగ పంట పెద్ద ఎత్తున త్వరలో మార్కెట్‌కు రానుందని చెబుతున్నారు. అలాగే, ఈసారి మస్టర్డ్ క్రాప్ ఉత్పత్తి సాధారణం కంటే 25 శాతం నుండి 30 శాతం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాబట్టి ధరలు ఇలా స్మూత్‌గానే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. దేశీయంగా సోయాబిన్, వేరుశనగ పంటలు ఈ ఏడాది పుంజుకున్నాయి. సమృద్ధికర క్రాప్ సీడ్ నేపథ్యంలో ధరలు పెరగకపోవచ్చు. అలాగే, ప్రపంచ ఆహార సరఫరా క్రమంగా మెరుగుపడుతోంది. పెళ్లిళ్ల వంటి సమయంలో ధరలు మరింత తగ్గవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications