ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రిలయన్స్ ఆఫర్: రోజుకు 50 లీటర్ల ఇంధనం ఉచితంగా..
కరోనా మహమ్మారి నేపథ్యంలో పెద్ద పెద్ద కంపెనీలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో మద్దతును అందిస్తోంది. కరోనాపై పోరు చేస్తున్న ప్రభుత్వాలకు అండగా ఉంటోంది. ఇందులో భాగంగా రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఉచితంగా ఇంధనం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఉచితంగా డీజిల్, పెట్రోల్ అందిస్తామని తెలిపింది.

50 లీటర్ల వరకు ఉచిత ఇంధనం
కరోనాపై చేస్తోన్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు తన వంతు మద్దతును అందిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా సహాయచర్యలకు ఉపయోగించే ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్సులకు రిలయన్స్ పెట్రోల్ బంకుల ద్వారా ఉచిత ఇంధనాన్ని అందిస్తామని తెలిపింది. సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అనుమతి లేఖల ఆధారంగా ఆయా వాహనాలకు రోజుకు గరిష్ఠంగా 50 లీటర్ల ఇంధనాన్ని అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.

జూన్ 30 వరకు ఇంధనం
ఈ ఉచిత ఇంధన సౌకర్యాన్ని జూన్ 30వ తేదీ వరకు కొనసాగిస్తామని రిలయన్స్ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు మరో 80 టన్నుల చొప్పున లిక్విడ్ ఆక్సిజన్‌ను సమకూర్చినట్లు తెలిపింది. జామ్ నగర్ రిలయన్స్ ప్లాంట్ నుండి ఇండియన్ రైల్వేస్ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్సుపోర్ట్ చేసినట్లు తెలిపింది. రిలయన్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే ఏ ఇతర కార్పోరేట్ సంస్థ ప్రారంభించని అతిపెద్ద మిషన్ అన్న సేవ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది.

మిషన్ అన్న సేవ
మిషన్ అన్న సేవ కింద 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 200 మంది భాగస్వాములతో కలిసి 5.5 కోట్ల మందికి గ్రాసరీ కిట్స్, వండిన అన్నం, బల్క్ రేషన్ సరఫరా చేస్తోంది రిలయన్స్. ఇదిలా ఉండగా జూన్ 30వ తేదీ వరకు ప్రభుత్వం గుర్తించిన వాహనాలకు ప్రతి రోజు 50 లీటర్ల ఇంధనం ఉచితంగా అందించనున్నట్లు రాజస్తాన్ ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. రాజస్థాన్‌లోని 109 రిలయన్స్ పెట్రోల్ బంకుల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications