Mukesh Ambani: పెట్రోల్ నుంచి డిజిటల్ పేమెంట్స్ వరకు అన్ని రంగాల్లోనూ అంబానీ విస్తరణ విరామం లేకుండా కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఫిన్ టెక్ రంగంలోని కంపెనీలకు నిద్రలేకుండా చేస్తోంది.
అంబానీ తన స్లో పాయిజన్ స్ట్రాటజీని మళ్లీ తెరమీదకు తీసుకొస్తున్నారు. జియో టెలికాం రంగంలో సృష్టించిన ప్రభంజనాన్ని మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే రిలయన్స్ తన ఉద్యోగులతో కలిసి సౌండ్ బాక్స్ చెల్లింపు వ్యవస్థను పరీక్షిస్తోంది. జియో తన ఆర్థిక సేవలను విస్తరించాలని చూస్తున్నందున.. మిగిలిన ఫిన్ టెక్ కంపెనీల మాదిరిగానే విజయవంతమైన చెల్లింపు లావాదేవీలను ధృవీకరించే పరికరాన్ని సిద్ధం చేస్తోంది.

ఇలాంటి సాంకేతికతను ముందుగా పేటీఎం సంస్థ దేశంలో పరిచయం చేసింది. రిటైల్ వ్యాపారుల వద్ద ఇది అత్యంత ప్రాచుర్యం పొంది విస్తృతంగా ఉపయోగించబడుతోంది. చెల్లించిన మెుత్తాన్ని స్పీకర్ ఆడియో కన్ఫమేషన్ అందిస్తూ వ్యాపారులకు లావాదేవీలపై నమ్మకాన్ని పెంచుతుంది. పైగా సౌండ్ బాక్స్ లాభదాయకమైన సబ్‌స్క్రిప్షన్ మోడల్‌గా కూడా పనిచేస్తోంది. నామాత్రపు ఛార్జీలతో పేటీఎం, ఫోన్ పేలు వీటిని రిటైల్ దుకాణదారులకు అందిస్తున్నాయి. పైగా ఈ డేటా ఆధారంగా వ్యాపారులకు రుణాలను సైతం ఆఫర్ చేస్తున్నాయి.
దేశంలోని దిగ్గజ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ వంటివి తమ సొంత స్పీకర్లను సిద్ధం చేస్తుండగా.. అమెజాన్, గూగుల్ వంటి టెక్ కంపెనీలు సైతం తమ సొంత వేరియంట్లను పరీక్షించడం ప్రారంభించాయి. ఈ క్రమంలో రిలయన్స్ సంస్థ తాజాగా సిద్ధం చేస్తున్న స్పీకర్ బాక్స్.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మరిన్ని వ్యాపారాల్లోకి విస్తరించటానికి దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ముందు కంపెనీ అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్‌తో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి భాగస్వామ్యాన్ని సంపాదించింది.


Click it and Unblock the Notifications