ముంబై: స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం, జూలై 15) స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం మార్కెట్లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. కానీ చివరి గంటలో నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత కాస్త పుంజుకొని స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 18పాయింట్ల లాభంతో 36,051, నిఫ్టీ 10పాయింట్ల లాభంతో 10,618 వద్ద ముగిశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్, గెయిల్ ఉన్నాయి.

4 శాతం నష్టపోయిన రిలయన్స్ షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నేడు భారీగా కుంగిపోయాయి. రిలయన్స్ ఏజీఎం సమావేశం కంటే ముందు షేర్లు లాభాల్లో ఉన్నప్పటికీ, ఆ తర్వాత సౌదీ ఆరామ్-కోతో ఒప్పందంలో ఎలాంటి డెవలప్‌మెంట్ లేకపోవడంతో రిలయన్స్ షేర్ల పైన ప్రభావం పడింది. ఈ ఏజీఎంలో సౌదీ ఆరామ్‌కోతో ఒప్పందం గురించి చెబుతారని చాలామంది భావించారు. కానీ ఇది ముందుకు కదల్లేదు. దీంతో ఓ సమయంలో రిలయన్స్ షేర్లు 6.15 శాతం పడిపోయి 1,798 తగ్గింది. ఆ తర్వాత 3.71 శాతం నష్టపోయి రూ.1,845.60 వద్ద ముగిసింది.

రూ.1.26 లక్షల కోట్ల రిలయన్స్ ఎం-క్యాప్ డౌన్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వ్యాల్యూ రూ.1.26 లక్షల కోట్లు పడిపోయి రూ.11.7 లక్షల కోట్లుగా నిలిచింది. సౌదీ ఆరామ్‌కోతో ఒప్పందంపై అందరూ సానుకూలతను ఆశిస్తున్నారని, కానీ అందులో ఎలాంటి పురోగతి లేదని, గూగుల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రకటన మినహా మిగతావి అన్ని ఇదివరకు తెలిసినవేనని కాబట్టి ఏజీఎం సమావేశంపై అందరి దృష్టి సౌదీ ఆరామ్ కో వైపే ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే సౌదీ ఆరామ్ కోతో సుదీర్ఘ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని ముఖేష్ చెప్పారని గుర్తు చేస్తున్నారు.

గ్లోబల్, ఆసియా మార్కెట్లు లాభాల్లో..
అంతకుముందు నష్టాల్లో ఉన్న యూరోపియన్ స్టాక్ మార్కెట్లు బుధవారం తిరిగి పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. కరోనా వైరస్ వ్యాక్సీన్ త్వరలో వస్తుందనే నమ్మకం.. మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. ఇదిలా ఉండగా క్రూడాయిల్ ధరలు ఈ రోజు పెరిగాయి. ఒపెక్ కమిటీ సమావేశం జరగనుంది.


Click it and Unblock the Notifications