Reliance Retail: ప్రఖ్యాత రిలయన్స్ గ్రూప్ వ్యాపారాలను ముఖేష్ అంబానీ వారసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. వారిలోని సత్తాలకు అనుగుణంగా వివిధ వ్యాపారాలను అప్పగించారు. ఈ క్రమంలో కుమార్తె ఇషాకు రిలయన్స్ రిటైల్ పగ్గాలు దక్కాయి.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్ రిటైల్ ఇప్పటికే అనేక విభాగాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇదే క్రమంలో రిలయన్స్ తన సొంత బ్రాండ్లతో FMCG రంగంలోకి ప్రవేశించి భారతీయ రిటైల్ మార్కెట్‌పై భారీ ప్రభావాన్ని చూపింది. వేసవిలో శీతలపానీయాల విక్రయంలోకి క్యాంపాకోలాను లాంచ్ చేసి పెప్సీ, కోకాకోలాలకు గట్టి పోటీని ఇచ్చింది.

తాజాగా రిలయన్స్ శుక్రవారం రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లకు వేర్వేరుగా మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ రూ.2,415 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,139 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం కావటం విశేషం.
రిలయన్స్ రిటైల్ పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.9,181 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇది దాదాపు 1.1 బిలియన్ డాలర్లు కావటం గమనార్హం. మార్చి త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.50,834 కోట్ల నుంచి 21 శాతం పెరిగి.. రూ.61,559 కోట్లకు చేరుకుంది. కిరాణా, ఫ్యాషన్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, లైఫ్ స్టైల్ వంటి రంగాల్లో కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది.
జియో మార్ట్ పేరుతో రిటైల్, హోల్ సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ రిలయన్స్ రిటైల్ వేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 15,000 కంటే ఎక్కువ స్టోర్లు ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో కంపెనీ కొత్తగా 966 స్టోర్లను కొత్తగా ప్రారంభించింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో దాదాపు 35 శాత వృద్ధిని నమోదు చేయగా.. లైఫ్ స్టైల్ సెగ్మెంట్ 19 శాతం రాబడిని పెంచుకుంది.


Click it and Unblock the Notifications