Reliance: దేశంలో ఆయిల్ నుంచి టెలికాం వరకు అనేక రంగాల్లో వ్యాపారాలను కలిగి ఉన్నారు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ. ఇప్పటి వరకు విదేశాల్లోనే వినిపించిన తొలగింపులు ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ లోనూ ప్రారంభమయ్యాయి.
దేశంలో మారుమూల కిరాణా దుకాణాలకు సైతం హోల్ సేల్ ధరలకు సరుకులను అందించాలని రిలయన్స్ రిటైల్ కు చెందిన జియో మార్ట్ సేవలను ప్రారంభించింది. అయితే వ్యాపార వాతావరణం ప్రస్తుతం అనుకూలంగా లేనందున B2B వ్యాపారంలో దూకుడు తగ్గించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం జియో మార్ట్ దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఈ తొలగింపులు ఇక్కడికి పరిమితం కావని తెలుస్తోంది. రానున్న మరికొన్ని వారాల్లో కంపెనీ 9,900 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తోందని సమాచారం. ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా వ్యాపార మార్జిన్లను మెరుగుపరుచుకోవాలనే లక్ష్యంలో భాగంగా రిలయన్స్ గ్రూప్ తొలగింపుల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సాంప్రదాయ కిరాణా వ్యాపారంలో పోటీ, పంపిణీ అంతరాయాలు వంటి అనేక చిక్కులు ఉన్నాయి. ఇలాంటి క్రమంలో నష్టాలను తగ్గించుకోవడంపై జియోమార్ట్ ఇప్పుడు దృష్టి సారించిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న 150 కంటే ఎక్కువ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లలో సగానికి పైగా మూసివేయాలని యోచిస్తోందని తెలుస్తోంది.
రిలయన్స్ రిటైల్ జర్మన్ రిటైలర్ మెట్రో AG భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా 3500 మంది ఉద్యోగులు రిలయన్స్ గ్రూప్ కిందకు రానున్నారు. అయితే దీని కారణంగా అనేక మార్చులు వచ్చి రానున్న కాలంలో మరికొన్ని తొలగింపులు ఉండవచ్చని తెలుస్తోంది. మెుత్తానికి దేశీయ రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్ వ్యాపార అనిశ్చితులతో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించటం అనేక మందిని ఆందోళనకు గురిచేస్తోంది.


Click it and Unblock the Notifications