Reliance news: ప్రతి వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేయాలని రిలయన్స్ తహతహలాడుతోంది. తన రిటైల్ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్వదేశ్ స్టోర్లను ప్రారంభిస్తోంది. ఇతర ప్లేయర్స్ కు భిన్నంగా పలు ఫీచర్లు ఈ దుకాణాల్లో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో రిలయన్స్ రిటైల్ తన తొలి స్వదేశ్ స్టోర్‌ను మొదలుపెట్టింది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్‌పర్సన్ నీతా అంబానీ దీన్ని ప్రారంభించారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని సంపన్న సబర్బన్ పరిసరాల్లో దాదాపు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్ ను నెలకొల్పారు.

ఇటీవల ఆదరణకు నోచుకోని, పురాతన, స్థానిక ఉత్పత్తులను స్వదేశ్ స్టోర్లలో విక్రయించనున్నారు. దేశీయ ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన కళాకారులు పూర్తిగా చేతితో తయారు చేసిన కలెక్షన్స్ ఇక్కడ పొందవచ్చు. భారత్ లోని వివిధ రకాల ఆహార ఉత్పత్తులు, దుస్తులు, హస్తకళలు గురించి సదర్శకులు తెలుసుకోవచ్చు. ప్రతి ఉత్పత్తి, దాని తయారీదారుల కథనం గురించి చెప్పే 'స్కాన్ అండ్ నో' ఫీచర్ ప్రత్యేకత ఆకర్షణగా నిలవనుంది.
కస్టమర్లు కోరిన విధంగా యునిక్ ఉత్పత్తులు తయారుచేసేందుకు కస్టమైజేషన్ సేవలు కూడా ఇందులో లభిస్తాయి. ఇక ఆహార ప్రియుల కోసం ఫార్మ్-టు-టేబుల్ కేఫ్ ఏర్పాటు చేశారు. తమ స్టోర్ల ద్వారా పలువురు కళాకారులు, చేతివృత్తుల నిపుణులకు స్థిరమైన జీవనోపాధి లభిస్తుందని కంపెనీ పేర్కొంది. దేశీయ పురాతన కళలను ప్రపంచానికి పరిచయం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించింది.
స్వదేశ్ స్టోర్లను US, యూరప్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో రిలయన్స్ రిటైల్ విస్తరిస్తుందని, తద్వారా దేశీయ హస్తకళాకారులకు తగినంత గుర్తింపు లభిస్తుందని నీతా అంబానీ తెలిపారు. స్టోర్ ప్రారంభం అనంతరం.. మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఒలింపిక్స్ ఛాంపియన్ PV సింధు, సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌తో పాటు ఇతరులను కలిశారు.


Click it and Unblock the Notifications