రిలయన్స్‌లోకి మరో 2 భారీ పెట్టుబడులు, InVIT ద్వారా మరో రూ.40,000 కోట్ల సమీకరణ!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. మరో రెండు విదేశీ కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జీఐసీ(GIC), గ్లోబల్ ప్రయివేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ(TPG) క్యాపిటల్ తాజాగా రిలయన్స్ రిటైల్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించాయి. TPG, GIC కలిసి రూ.7,350 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అంతకుముందు రిలయన్స్ జియోలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించిన ముఖేష్ అంబానీ, ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌లోకి సమీకరిస్తున్నారు.

రెండు కంపెనీలు.. వాటాలు ఎంత అంటే
రిలయన్స్ రిటైల్‌లో GIC రూ.5,512.5 కోట్లు ఇన్వెస్ట్ చేసి 1.22 శాతం వాటాను దక్కించుకోనుంది. TPG రూ.1,837.5 కోట్లతో పెట్టుబడితో 0.41 శాతం వాటాను దక్కించుకుంటోంది. ఈ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స్ రిటైల్ ప్రీ-మనీ ఈక్విటీ వ్యాల్యూ రూ.4.285 లక్షల కోట్లుగా ఉంది. జియోలో టీపీజీ రూ.4,546.8 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. రిలయన్స్ రిటైల్‌లో ఇప్పటికి 7.28 శాతం వాటాను విక్రయించారు ముఖేష్ అంబానీ. ఈ వాటాల విక్రయం ద్వారా రూ.32,297.50 కోట్లు సమీకరించారు.

ఎవరి వాటా ఎంత?
రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్ రూ.9,375 కోట్లు ఇన్వెస్ట్ చేసి 2.13 శాతం వాటాను దక్కించుకుంది.
జనరల్ అట్లాంటిక్ రూ.3,675 కోట్ల పెట్టుబడితో 0.84 శాతం వాటాను పొందింది.
కేకేఆర్ రూ.5,550 కోట్లను పెట్టుబడిగా పెట్టి 1.28 శాతం వాటాను దక్కించుకుంది.
ముబాదాల రూ.6,247.50 కోట్ల మొత్తాన్ని పెట్టుబడి పెట్టి 1.4 శాతం వాటాను దక్కించుకుంది.
తాజాగా, జీఐసీ రూ.5,512.5 కోట్లు పెట్టుబడి పెట్టి 1.22 శాతం వాటాను పొందింది.
టీపీజీ రూ.1,837.50 కోట్ల పెట్టుబడితో 0.41 శాతం దక్కించుకుంది.
మొత్తం రూ.32వేల కోట్లకు పైగా సమీకరించింది.

రూ.40,000 కోట్ల సమీకరణకు రిలయన్స్ ఆలోచన
ఇదిలా ఉండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మౌలిక సదుపాయాల పెట్టుబడుల ట్రస్ట్(InvIT) మార్గంలో ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ ఆస్తులను నగదీకరించడం ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. డిజిటల్ ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ ట్రస్టు(DFIT) ఒక ఇన్విట్‌లో 51 శాతం వాటా ఉంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కూడా 48.44 శాతం వాటా ఉంది. ప్రయివేటు ప్లేస్‌మెంట్ పద్ధతిలో ఒక్కొక్కటి రూ.100 చొప్పున 147.06 కోట్ల యూనిట్లను జారీ చేయడం ద్వారా DFIT రూ.14,700 కోట్లు సమీకరించే అవకాశముందని సెబి వద్ద దాఖలు చేసిన డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తోంది. ఫైబర్ ఆప్టిక్ ట్రస్టులో ఇతర మైనార్టీ వాటాదారులకు 0.56 శాతం వాటా ఉంది. అలాగే బాండ్స్ ద్వారా మరో రూ.25వేల కోట్లను DFIT సమీకరిస్తుంది.


Click it and Unblock the Notifications