రుణరహిత సంస్థగా అవతరించిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల పెట్టుబడుల విలువను మరింతగా పెంచడంపై దృష్టి సారించిందని బెర్న్‌స్టెన్ రీసెర్చ్ తాజా నివేదిక అభిప్రాయపడింది. ఇందుకోసం రానున్న మూడు నాలుగేళ్లలో రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ విభాగాలు పబ్లిక్ ఆఫరింగ్ (IPO)కు రావొచ్చునని, ఐపీవో ద్వారా ఈ రెండు వ్యాపారాలను రిలయన్స్ విభజించవచ్చునని కూడా ఈ రిపోర్ట్ అభిప్రాయంపడింది.

మూడు నాలుగేళ్లలో వ్యాపారాల విభజన
రిలయన్స్ డిజిటల్ సేవల అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 25 శాతం వాటా విక్రయం ద్వారా రెండు నెలల్లోనే రూ.1.15 లక్షల కోట్లు సమీకరించింది రిలయన్స్. భారత్‌లో అతిపెద్ద రైట్స్ ఇష్యూ ద్వారా మరో రూ.53 వేల కోట్లు సమీకరించింది. ఈ ట్రాన్సాక్షన్స్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తిగా రుణరహితంగా మారిందని, జియో, రిటైల్ వ్యాపారాల ఐపీవోల ద్వారా రాబోయే మూడు నాలుగేళ్లలో కంపెనీలో వ్యాపారాల విభజన చోటు చేసుకునే అవకాశముందని బెర్న్‌స్టెన్ రీసెర్చ్ తెలిపింది.

నిధుల నిల్వలతో ఏం చేస్తుందనేది కీలకం
కంపెనీలో వ్యాపారాల విభజన ద్వారా వాటాదారుల విలువ మరింత పెరుగుతుందని కూడా బెర్న్‌స్టెన్ రీసెర్చ్ పేర్కొంది. 15 బిలియన్ డాలర్ల సౌదీ ఆరామ్‌కో ఒప్పందం, మిగులు నగదు నిల్వలతో వచ్చే కొన్నేళ్లలో ఈక్విటీ-నికర రుణ నిష్పత్తి 2020-21 నాటి కంటే పడిపోవచ్చునని తెలిపింది. చమురు-రసాయనాల వ్యాపారంలో వాటా విక్రయం ద్వారా సౌదీ ఆరామ్‌కోతో రిలయన్స్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతోంది. రిలయన్స్ ఈ గణనీయ నిధుల నిల్వలతో ఏం చేస్తుందనేది ఇప్పుడు కీలకమని, ప్రస్తుతం అయితే బ్యాలెన్స్ షీట్ పటిష్టం చేసుకునేందుకు ఇతర రుణ బకాయిలను తగ్గించుకునేందుకు, కేటాయింపులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చునని తెలిపింది.

షేర్ వ్యాల్యూ రూ.1870కి
ఇంటర్నెట్, రిటైల్ వ్యాపార విస్తరణలతో విలీనాలు, కొనుగోళ్ల ద్వారా మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆరామ్‌కో భాగస్వామ్యంలో రిఫైనింగ్, పెట్రో రసాయనాల వ్యాపారంలోను విస్తరణ చోటు చేసుకోవచ్చునని తెలిపింది. 2020-21లో రిలయన్స్ ఎబిటా రూ.86,000 కోట్లుగా నమోదయ్యే అవకాశముందని బెర్న్‌స్టెన్ రీసెర్చ్ తెలిపింది. 2024-25 నాటికి ఎబిడా రెంట్టింపు కావొచ్చునని కూడా అంచనా వేసింది. ఇంధనం వంటి ఆదాయాల మాట ఎలా ఉన్నా జియో, కొత్త వ్యాపారాల వృద్ధికి ఇది దోహదం చేస్తుందని తెలిపింది. అలాగే షేర్ లక్ష్యాన్ని రూ.1720 నుండి రూ.1870కి పెంచింది.


Click it and Unblock the Notifications