Reliance News: క్విక్ కామర్స్ రంగంలోకి రిలయన్స్.. ప్రత్యర్థులకు చెమటలు షురూ..
Quick Commerce: కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించేందుకు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ఆసక్తి చూపుతున్నట్లు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిత్యావసర సరుకులను ఇంటికే డెలివరీ చేస్తూ జియో మార్ట్ ఇప్పటికే వివిధ పట్టణాలు, నగరాల్లో ప్రజలకు అందుబాటులో ఉంది. అయితే మరిన్ని విభాగాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది.
క్విక్ కామర్స్ ఇండస్ట్రీలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగుపెడుతున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. త్వరిత డెలివరీ సేవల విభాగంలోనూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. జొమాటో బ్లింకిట్, టాటా గ్రూప్ బిగ్ బాస్కెట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థలకు పోటీగా రంగంలోకి దిగుతోంది.

రిలయన్స్ రిటైల్ యాజమాన్యంలోని జియోమార్ట్ వచ్చే నెల ప్రారంభంలో క్విక్ కామర్స్ సేవలను ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. కొవిడ్-19 విజృంభణ, లాక్‌డౌన్‌ల అనంతరం ఈ విభాగం అత్యంత వేగంగా ప్రజాదరణ పొందింది. దీన్ని క్యాష్ చేసుకోవాలని వాల్‌మార్ట్ అనుబంధ ఫ్లిప్‌కార్ట్ కూడా ప్రణాళికలు రచిస్తోంది. కాగా ఇప్పుడు రిలయన్స్ ఈ పోటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
జియోమార్ట్ తన ప్లాట్‌ఫారమ్ కవరేజీని వెయ్యి నగరాలకు పైగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరిట 90 నిమిషాల్లో కిరాణా సరుకుల డెలివరీ సర్వీస్‌ను గంతంలో ఆ రిలయన్స్ ప్రారంభించి నిలిపివేసింది. ఇది జరిగిన ఏడాది తర్వాత మళ్లీ అదే విభాగంలో ప్రవేశానికి పావులు కదుపుతోంది. అయితే ఈసారి 30 నిమిషాల్లోనే డెలివరీలు అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. వివిధ స్లాట్స్‌తో పాటు మరుసటి రోజు డెలివరీ సేవలను సైతం యూజర్లకు అందివ్వనున్నట్లు నివేదిక పేర్కొంది.


Click it and Unblock the Notifications