ప్రపంచంలో రిలయన్స్ జియో కొత్త రికార్డ్, ఆదాయం అదుర్స్
రిలయన్స్ జియో లాభాలు సెప్టెంబర్ త్రైమాసికంలో దూసుకెళ్లాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 185 శాతం పెరిగి రూ.2,844 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.990 కోట్లతో పోలిస్తే భారీగా పెరగడం గమనార్హం. ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 33 శాతం ఎగిసి రూ.17,481 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.13,130 కోట్లుగా ఉంది. ఆర్పు రూ.145గా ఉంది.

73 లక్షల మంది చందాదారులు యాడ్
సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్తగా 73 లక్షలమంది చందాదారులు రిలయన్స్ జియోలో చేరారు. ప్రతి యూజర్(ARPU)పై ఆదాయం ఏడాది ప్రాతిపదికన రూ.127.40 నుండి రూ.145కు పెరిగింది. జూన్ త్రైమాసికంలో రూ.140.3గా ఉంది. జియో సహా డిజిటల్ సేవల వ్యాపారం ఆదాయం రూ.16,717 కోట్ల నుంచి ఏకంగా రూ.22,679 కోట్లకు ఎగిసింది. జియో సహా అన్ని డిజిటల్ సేవల్ని ఒకే గూటికి చేర్చుతూ ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్ స్థూలలాభం 53 శాతం వృద్ధి చెంది రూ.8,345 కోట్లుగా నమోదైంది. నెలవారీ వైర్ లెస్ చందాదారులు 1.69 శాతం పెరిగారు.

డేటా, వాయిస్ కాల్స్ వినియోగం..
సెప్టెంబర్ త్రైమాసికంలో నెలకు సగటున ఒక వినియోగదారుడి వైర్‌లెస్ డేటా వినియోగం 12GBగా ఉంది. సగటు వాయిస్ కాల్స్ వినియోగం 776 నిమిషాలుగా ఉంది. ఒక దేశంలో 400 మిలియన్ సబ్‌స్క్రైబర్లు కలిగిన అతిపెద్ద/ఏకైక నెట్ వర్క్‌గా (చైనా కాకుండా) జియో నిలిచింది. నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 1 శాతం ఎగిసి రూ.2,054 వద్ద ముగిసింది. రిలయన్స్ జియోలోకి తొలి క్వార్టర్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే.

రిటైల్ ఆదాయం రూ.39వేల కోట్లు
రెండో త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ ఆదాయం దాదాపు 5 శాతం తగ్గి రూ.39,199 కోట్లుగా నమోదయింది. నిర్వహణ లాభం దాదాపు 14 శాతం తగ్గి రూ.2,009 కోట్లకు పరిమితమైంది. తన రిటైల్ స్టోర్స్‌లో 85 శాతం తెరుచుకున్నట్లు తెలిపింది. అదనంగా 232 స్టోర్స్‌ను జత చేయడంతో మొత్తం స్టోర్స్ 11,931 కోట్లకు చేరుకుంది. రిటైల్ విభాగం ఇటీవలి కాలంలో సుమారు రూ.37,710 కోట్ల మేర పెట్టుబడులను సమీకరించింది. సిల్వర్ లేక, కేకేఆర్, టీపీజీ, జనరల్ అట్లాంటిక్ వంటి దిగ్గజాలు పెట్టుబడులు పెట్టాయి.


Click it and Unblock the Notifications