జియో మరో సంచలనం..రూ.1,000కే రూ.10 వేల విలువైన పరీక్షలు.. వైద్య రంగాన్ని టార్గెట్ చేసిన ముఖేష్ అంబానీ..
ధీరూభాయ్ అంబానీ మరణం తర్వాత రిలయన్స్ సామ్రాజ్యం రెండు భాగాలుగా విడిపోయిన సంగతి విదితమే. ఒకవైపు ముఖేష్ అంబానీకి ముడి చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్ వంటి పారిశ్రామిక వ్యాపారాలు దక్కగా, మరోవైపు అనిల్ అంబానీకి టెలికాం, విద్యుత్, ఆర్థిక సేవలు వంటి వినియోగదారులపై ఆధారపడే కీలక రంగాలు లభించాయి. కాలక్రమంలో అనిల్ అంబానీ నేతృత్వంలోని సంస్థలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోయినా.. ముఖేష్ అంబానీ మాత్రం నిరంతరం కొత్త రంగాల్లో అడుగుపెడుతూ మార్కెట్‌ను కుదిపేస్తూనే ఉన్నారు.
ఇటీవలి కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పాత బ్రాండ్ లకు ఊపిరి తీసుకెరావడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తమిళనాడులోని ఉదయం దాల్‌లో పెద్ద వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరగడం, ఆ తర్వాత SIL అనే పురాతన బ్రాండ్‌ను కొనుగోలు చేసి రీబ్రాండ్ చేయడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే, ఇప్పుడు రిలయన్స్ దృష్టి మరింత కీలకమైన రంగమైన వైద్య పరీక్షలు, ముఖ్యంగా జన్యు పరీక్షలు (Genetic Testing)పై పడింది.

భారతదేశంలో వైద్య పరీక్షల మార్కెట్ రోజు రొజుకు భారీగా విస్తరిస్తోంది. ఇందులో జన్యు పరీక్షలకు భవిష్యత్తులో విపరీతమైన డిమాండ్ ఉండబోతోందని ముఖేష్ అంబానీ చాలా ముందుగానే గ్రహించారు. అందుకే రిలయన్స్.. ప్రజలకు కేవలం రూ.1,000కే జన్యు పరీక్షలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ తరహా పరీక్షల ధర సగటున రూ.10 వేల వరకు ఉంది. రిలయన్స్ ఈ ధరను దాదాపు పది రెట్లు తగ్గించాలని నిర్ణయించడం విశేషంగా చెప్పవచ్చు.
2016లో జియో ప్రవేశంతో టెలికాం రంగం పూర్తిగా మారిపోయింది. ఉచిత కాల్స్, తక్కువ ధరల డేటాతో ఇంటర్నెట్ వినియోగం గ్రామాల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో ఆరోగ్య రంగంలోనూ ఒక Jio తరహా విప్లవం తీసుకురావాలని రిలయన్స్ భావిస్తోంది. జన్యు పరీక్షలు అందుబాటులోకి వస్తే.. ప్రజలు వ్యాధులను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ కొత్త వెంచర్‌కు టెక్నాలజీ మద్దతుగా రిలయన్స్ బెంగళూరుకు చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ను ఉపయోగించుకుంటోంది. 2021లో రిలయన్స్ ఈ సంస్థను సుమారు రూ.393 కోట్లకు కొనుగోలు చేసింది. స్ట్రాండ్ జీనోమ్ సైన్స్, అధునాతన డయాగ్నస్టిక్ టెక్నాలజీలో ఇది నైపుణ్యం కలిగి ఉంది. ఈ టెక్నాలజీ సహాయంతో తక్కువ ఖర్చుతో, ఖచ్చితమైన జన్యు పరీక్షలను అందించడం సాధ్యమవుతుంది.
జన్యు పరీక్ష అంటే ఏమిటి? రక్తం, లాలాజలం లేదా శరీర కణజాల నమూనాల ఆధారంగా నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఒక వ్యక్తికి ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉందో, క్యాన్సర్ వంటి సమస్యలకు ఎంత ప్రమాదం ఉందో ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన చికిత్సా ప్రణాళిక రూపొందించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది వ్యక్తిగత వైద్యానికి (Personalised Medicine) పునాది రాయిగా చెప్పవచ్చు.
ఇప్పటివరకు చాలా ఖరీదు కారణంగా ఈ పరీక్షలు కొద్దిమందికే పరిమితమయ్యాయి. ధరలు తగ్గితే లక్షలాది మంది ఈ సేవలను వినియోగించుకోగలుగుతారు. ముంబైలో ఇప్పటికే రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న ముఖేష్ అంబానీకి వైద్య రంగం కొత్తదేమి కాదు. ఇప్పుడు జన్యు పరీక్షల రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా, భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పుకు రిలయన్స్ నాంది పలుకుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి జియో వైద్య రంగంలో ఎలాంటి విప్లవాలు సృష్టిస్తుందో ముందు ముందు చూడాలి.


Click it and Unblock the Notifications