Jio News: భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన సంస్థ అంబానీకి చెందిన రిలయన్స్ జియో. ఒకప్పుడు రూ.10 రీఛార్జ్ చేసుకోవటానికి వెనకాడిన భారతీయ కస్టమర్లను వందల రూపాయలు ఖర్చుచేసి ఇంటర్నెస్ సేవలు వాడేలా ప్రేరేపించింది.
తాజాగా భారతీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించింది. జియో డేటా ట్రాఫిక్ పరంగా చైనా మొబైల్‌ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా అవతరించింది. సోమవారం తన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన కంపెనీ వివిధ విభాగాల్లో సాధించిన అద్భుత విజయాలు, మైలురాళ్లను వెల్లడించింది. మార్చి 2024 నాటికి జియో మెుత్తం 481.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్ బేస్‌ను కలిగి ఉంది. వీరిలో 108 మంది యూజర్లు జియో ట్రూ5జీ సేవలను వినియోగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

తాజా గణాంకాలతో జియో భారతీయ టెలికాం మార్కెట్లో తన బలమైన స్థానాన్ని ప్రతిబింబించింది. కంపెనీ తనకు 28 శాతం ట్రాఫిక్ 5జీ సబ్‌స్క్రైబర్‌ల నుంచి వస్తున్నట్లు వెల్లడించింది. ఇది తరువాతి తరం కనెక్టివిటీ వైపు వినియోగదారులు వేగంగా మారటాన్ని సూచిస్తోంది. దీనికి తోడు జియో ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్(FWA) సేవలు డేటా ట్రాఫిక్‌కు గణనీయంగా దోహదపడ్డాయి.
దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ప్రజల్లో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జియో వార్షిక డేటా ట్రాఫిక్ నాటకీయంగా 2.4x పెరుగుదలను చూసింది. అలాగే తలసరి నెలవారీ డేటా వినియోగం మూడేళ్ల క్రితం కేవలం 13.3GB నుంచి ప్రస్తుతం 28.7GBకి పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ఈ పెరుగుదల భారతదేశంలో డిజిటల్ కనెక్టివిటీపై పెరుగుతున్న ఆధారపడటాన్ని నొక్కి చెబుతోంది. ప్రస్తుతం కంపెనీ మారుమూల ప్రాంతాలకు శాటిలైట్ కనెక్టివిటీ సేవలను అందించే సాంకేతికపై ప్రధానంగా దృష్టి సారించింది.


Click it and Unblock the Notifications