జియో న్యూ ఇయర్ బంపర్ ఆఫర్: రేపటి నుంచి టారిఫ్‌లో ఇదీ పెను మార్పు: ఏ నెట్‌వర్క్ అయినా
ముంబై: రిలయన్స్ జియో యాజమాన్యం తన నెట్‌వర్క్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ఇంటర్ కనెక్ట్ యూసేజ్ (ఐసీయూ) ఛార్జీలను తొలగించింది. దేశీయంగా.. జియో సిమ్ కార్డ్ నుంచి ఏ ఇతర మొబైల్ కంపెనీల మొబైల్ ఫోన్లకు ఫోన్ కాల్ చేసినా.. ఎలాంటి ఛార్జీ ఉండదు. అవన్నీ ఉచితమేనని రిలయన్స్ జియో యాజమాన్యం వెల్లడించింది. అన్ లిమిటెడ్ ఫ్రీ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎప్పటి నుంచి అమలు
ఈ ఉచిత అపరిమిత ఫోన్ కాల్స్.. జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని రిలయన్స్ జియో వెల్లడించింది. దీన్ని దేశీయ ఫోన్ కాల్స్ పరిమితం చేసింది. విదేశాలకు ఫోన్ చేయాలంటే షరతులకు అనుగుణంగా ఛార్జీలను వసూలు చేస్తామని పేర్కొంది.
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాలకు లోబడి ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీలను తొలగించినట్లు స్పష్టం చేసింది. ఫలితంగా- అన్ లిమిటెడ్ కాల్స్ చేయడానికి వెసలుబాటు కల్పించినట్టయిందని తెలిపింది. జియో టు జియో, జియో టు వీఐ, జియో టు ఎయిర్‌టెల్, జియో టు బీఎస్ఎన్ఎల్.. ఇలా ఏ ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు ఫోన్ చేసినా ఛార్జీలు పడవు.

సెప్టెంబర్‌లో ఐయూసీ ఛార్జీలు..
గత ఏడాది సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో యాజమాన్యం ఈ ఐయూసీ ఛార్జీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తమ నెట్‌వర్క్ నుంచి ఏ ఇతర నెట్‌వర్క్ పరిధిలోని సర్వీస్ ప్రొవైడర్లకు ఫోన్ చేసినా.. ఛార్జీలు పడేలా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపట్ల మొదట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.
ఈ ఐయూసీ ఛార్జీలను ట్రాయ్ రద్దు చేస్తే.. తాము వాటిని తొలగిస్తామని అప్పట్లో రిలయన్స్ యాజమాన్యం వినియోగదారులకు హామీ ఇచ్చింది. తాజాగా- వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2021 జనవరి 1 నుంచి ఉచితంగా ఫోన్‌కాల్స్ చేసుకోవచ్చని తాజా తెలిపింది. అప్పట్లో తాము ఇచ్చిన హామీ మేరకు ఐయూసీ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

వినియోగదారులకు బెనిఫిట్ ఏంటీ?
జియో సిమ్ కార్డును వినియోగించే వారు శుక్రవారం నుంచి ఇక అన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. వాట్సప్, వీడియో కాల్స్‌కు ఇందులో చేర్చలేదు. డేటా ఆధారిత ఎలాంటి ఫోన్ కాల్ చేసినా.. దానికి ఛార్జీలను వసూలు చేస్తారు. వాయిస్ కాల్స్‌కు మాత్రమే అన్ లిమిటెడ్ ఆఫర్‌ను ఇచ్చింది. అదే సమయంలో డొమెస్టిక్ కాల్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ ఇస్తుననట్లు వెల్లడించింది. విదేశాలకు చేసే ఫోన్ కాల్స్‌కు మాత్రం యధావిథిగా ఛార్జీలను వసూలు చేస్తామని తెలిపింది.


Click it and Unblock the Notifications