25% చెల్లిస్తా చాలు.. రేపే రిలయన్స్ రైట్స్ ఇష్యూ: డిస్కౌంట్, చెల్లింపు, మరిన్ని వివరాలు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.53,125 కోట్ల విలువైన రైట్స్ ఇష్యూకు దరఖాస్తు చేసుకునేందుకు వాటాదారులు మొదట 25 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాన్ని వచ్చే ఏడాది మే, నవంబర్ నెలల్లో రెండు దఫాలుగా చెల్లించే వెసులుబాటు ఇస్తోంది కంపెనీ. వాటాదారుల సబ్‌స్క్రిప్షన్ కోసం మే 20వ తేదీ నుండి మొదలయ్యే రైట్స్ ఇష్యూ జూన్ 3వ తేదీన ముగియనుంది.

ప్రతి 15 షేర్లకు ఒక షేర్.. రూ.1,257
ఈ రైట్స్ ఇష్యూలో భాగంగా ప్రతి 15 రిలయన్స్ షేర్లకు ఒక షేరును జారీ చేస్తుంది. మే 18వ తేదీ నాటి షేర్ ముగింపు ధరపై 13 శాతం డిస్కౌంట్‌తో ఒక్కో షేర్‌ను రూ.1,257కు జారీ చేస్తోంది. రిలయన్స్ దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్లీ రైట్స్ ఇష్యూను ప్రకటించింది. 1991 తర్వాత మళ్లీ ఇప్పుడే రైట్స్ ఇష్యూ జారీ చేసింది రిలయన్స్. దేశంలో అతిపెద్ద రైట్స్ ఇష్యూ ఇది.

ఎప్పుడు చెల్లించాలి
రైట్స్ ఇష్యూలో దరఖాస్తు చేసుకునే సమయంలో 25 శాతంగా (ఒక్కో షేరుకు రూ.314.25) చెల్లించాలి. మరో 25 శాతాన్ని మే 2021 లోపు చెల్లించాలి. మిగతా 50 శాతాన్ని (రూ.628.50) నవంబర్ 2021 లోపు చెల్లించవచ్చు. ఈ మేరకు కంపెనీ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఈ నెల 17వ తేదీన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ రైట్స్ ఇష్యూ కమిటీ నిర్ణయించింది.

నగదు లభ్యత లేకుంటే రైట్స్ ఇష్యూ, కానీ రిలయన్స్ మాత్రం..
సాధారణంగా నగదు లభ్యత లేని కంపెనీలు రైట్స్ ఇష్యూకు వస్తాయి. కానీ రిలయన్స్ వద్ద రూ.1.75 లక్షల కోట్లు (2240 కోట్ల డాలర్లు) నగదు నిల్వలు ఉన్నాయి. కానీ 2021 నాటికి రుణ రహిత సంస్థగా మార్చే లక్ష్యంలో భాగంగా రైట్స్ ఇష్యూకు వచ్చింది. 1991లో రిలయన్స్ కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసింది. తద్వారా ప్రజల నుండి నిధులు సమీకరించింది. అంతకుముందు ఈ నెల 14న రైట్స్ ఇష్యూకు వస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిని 20వ తేదీకి వచ్చింది.

రుణాలు ఎంత ఉన్నాయి?
మార్చి క్వార్టర్ నాటికి రిలయన్స్ రుణాలు రూ.3,36,294 కోట్లు. రిలయన్స్ వద్ద 1,75,259 కోట్ల నగదు ఉంది. నికర రుణ స్థితి రూ.1,61,035 కోట్లుగా ఉంది. ఇటీవల రుణ రహిత సంస్థగా మార్చేందుకు వివిధ సంస్థలకు జియో ప్లాట్ ఫామ్స్‌లో వాటాలు విక్రయిస్తున్నారు ముఖేష్ అంబానీ. వాటాలు అమ్మడం, రైట్స్ ఇష్యూ.. ఇలా వివిధ మార్గాల్లో వచ్చే ఏడాది నాటికి రుణ రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఏమిటీ రైట్స్ ఇష్యూ?
ఏదైనా సంస్థ అదనపు మూలధనం సేకరించేందుకు రైట్స్ ఇష్యూ ఓ సాధనం. సాధారణంగా నగదు లభ్యత లేకుంటే కంపెనీలు ఈ ఆప్షన్ ఎంచుకుంటాయి. ఇక్కడ కంపెనీ ఇప్పటికే తమ వద్ద షేర్లు కొనుగోలు చేసిన వారి నుండి రైట్స్ ఇష్యూ ద్వారా మరిన్ని నిధులు సేకరిస్తుంది. వీరికి కొంత డిస్కౌంట్‌తో దీనిని అందిస్తారు.


Click it and Unblock the Notifications