చమురు ఎఫెక్ట్, రిలయన్స్ లాభాలు భారీగా డౌన్: రుణాలు ఉన్నా.. అదనపు నిధులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ సగటు లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 15 శాతం క్షీణించి రూ.9,567 కోట్లకు పరిమితమైంది. కరోనా కారణంగా చమురు వ్యాపారం డీలా పడటంతో దెబ్బపడింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.11,262 కోట్లుగా ఉంది. ఆదాయం కూడా 24 శాతం తగ్గి రూ.1,53,384 కోట్లుగా నమోదయింది. కంపెనీ మొత్తం ఆదాయాలలో 35 శాతం వాటా ఉన్న కస్టమర్ ఆధార విభాగాలు మాత్రం రాణించాయి. పెట్రో రసాయనాల విభాగం ఆదాయం 23 శాతం క్షీణించి రూ.29,665 కోట్లుగా ఉంది. పన్నుకు ముందు లాభం 33 శాతం తగ్గి రూ.5,964 కోట్లకు పరిమితమైంది.

కరోనాతో ఆదాయం డౌన్
రిటైల్, జియో వ్యాపారాలు మెరుగైన పనితీరు కనబర్చినప్పటికీ రిలయన్స్‌కు కీలకమైన ఆయిల్ టు కెమికల్ వ్యాపారం గండి కొట్టింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌తో పోలిస్తే కంపెనీ ఏకీకృత ఆదాయం 27.2 శాత వృద్ధి సాధించి రూ.1,28,385 కోట్లుగా నమోదయింది. నికర లాభం 28 శాతం వృద్ధితో రూ.10,602 కోట్లుగా నమోదయింది. ఈపీఎస్ రూ.14.8గా ఉంది. రిఫైనింగ్ వ్యాపార ఆదాయం రూ.97,229 కోట్ల నుండి రూ.62,154కు, చమురు, గ్యాస్ విభాగం ఆదాయం రూ.790 కోట్ల నుండి రూ.355 కోట్లకు తగ్గింది. రిఫైనింగ్ మార్జిన్ 5.7 డాలర్లుగా ఉంది.
రెండో త్రైమాసికంలోనూ కరోనా కంపెనీ వ్యాపారాలపై ప్రభావం చూపిందని రిలయన్స్ పేర్కొంది.

ముఖేష్ అంబానీ ఏమన్నారంటే
ఏప్రిల్-జూన్ క్వార్టర్‌తో పోలిస్తే గడిచిన 3 నెలల్లో కంపెనీ పటిష్ఠమైన పనితీరు కనబరిచిందని, పెట్రోకెమికల్స్, రిటైల్ వ్యాపారాలు కాస్త మెరుగయ్యాయని, డిజిటల్ సేవల వ్యాపారం నిలకడగా వృద్ధి కనబరుస్తోందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఆయిల్ టు కెమికల్ వ్యాపారానికి దేశీయంగా డిమాండ్ వేగంగా పుంజకుంటోందన్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపులతో రిటైల్ వ్యాపారం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుందని, గత ఆరు నెలల్లో జియో, రిటైల్ వ్యాపారాల్లో పెట్టుబడులు విక్రయం ద్వారా పలువురు వ్యూహాత్మక పెట్టుబడిదారులు రిలయన్స్‌లో భాగస్వాములైనట్లు తెలిపారు.

రుణాలు.. అప్పులు
సెప్టెంబర్ 30, 2020 నాటికి రిలయన్స్ స్థూల రుణాలు రూ.2,79,251 కోట్లుగా ఉంది. అంతకుముందు క్వార్టర్‌లో రూ.3,36,294 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ వద్ద నగదు నిల్వలు రూ.1,85,711 కోట్లుగా ఉన్నాయి. ఈ మధ్య వాటాల విక్రయం ద్వారా లభించిన మరో రూ.30,210 కోట్లతోపాటు త్వరలో రావాల్సిన రూ.73,586 కోట్లును కలుపుకుంటే రిలయన్స్ వద్ద రుణభారం కంటే రూ.10,250 కోట్ల అదనపు నిధులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications