రిలయన్స్ ఇండస్ట్రీస్ దుమ్మురేపింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ రూ.11.5 లక్షల కోట్ల మార్క్ దాటిపోయింది. ఈ రోజు షేర్ ధర మధ్యాహ్నం గం.2.17 సమయానికి 3.37 శాతం పెరిగి రూ.1,848.10కి చేరుకుంది. అంతకుముందు 2.5 శాతం పెరిగి రూ.1,833 చేరుకున్నప్పుడే రికార్డ్ మార్క్‌ను దాటేసింది. రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వరుస పెట్టుబడుల నేపథ్యంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ ఎం-క్యాప్ దూసుకెళ్లింది.

11 వారాల్లో రూ.3.7 లక్షల కోట్లు
షేర్ ధర 3.50 శాతం పెరిగి రూ.1,850 చేరుకున్న సమయానికి అప్పటికే రూ.11.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను దాటింది. ఏప్రిల్ 22న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ జియో ప్లాట్‌ఫాంలో రూ.43,574 కోట్ల పెట్టుబడులు పెట్టి 9.99 శాతం వాటా దక్కించుకున్న రోజు ఎం-క్యాప్ రూ.7.83 లక్షల కోట్లుగా ఉంది. 11 వారాల్లో ఎం-క్యాప్ రూ.3.7 లక్షల కోట్లు పెరిగి మరో రికార్డును నమోదు చేసింది. మార్చి 31, 2021 నాటికి కంపెనీని రుణరహిత సంస్థగా తీర్చిదిద్దుతామని ముఖేష్ అంబానీ గత ఏడాది ప్రకటించారు. కానీ దాదాపు 10 నెలల ముందే దానిని పూర్తి చేశారు. దీంతో రిలయన్స్ షేర్లకు రెక్కలు వచ్చాయి.

కరోనా టైంలో భారీగా వృద్ధి నమోదు చేసిన ఏకైక సంస్థ
కరోనా సమయంలో అంతకంతకూ ఎదిగిన భారతీయ సంస్థల్లో రిలయన్స్ ముందంజలో ఉంది. లిస్టయిన కంపెనీల్లో నష్టపోవడం లేదా అతి స్వల్పంగా లాభపడటం జరిగింది. కానీ రిలయన్స్ ఒక్కటే భారీగా ఆర్జించింది. జియో ప్లాట్‌ఫాంలోకి ఫేస్‌బుక్ మొదలు ఇంటెక్ వరకు వివిధ అంతర్జాతీయ సంస్థలు 12 పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. దీనికి రైట్స్ ఇష్యూ తోడయింది. దీంతో కంపెనీ 58 రోజుల్లో రూ.1.68 లక్షల కోట్లకు పైగా సమీకరించి రుణరహిత సంస్ధగా తయారయింది.

ఆ జాబితాలో రిలయన్స్‌కు చోటు
లండన్ ఫైనాన్షియల్ టైమ్స్ రూపొందించిన టాప్ 100 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 89వ స్థానంలో ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారి సమయంలో ఈ వైరస్‌ను అధిగమించి భారీగా ఎదిగిన కంపెనీల ఆధారంగా ఈ జాబితాను తయారు చేసింది. ఇందులో రిలయన్స్‌కు చోటు దక్కడం గమార్హం.

రిలయన్స్ షేర్ ధర రూ.2,000కు
రిలయన్స్ షేర్ వ్యాల్యూ ఈ ఏడాది చివరి నాటికి రూ.2,000కు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఈ ఏడాది చివరి నాటికి రూ.12 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అందుకోచ్చునని చెబుతున్నారు. దీపావళి నాటికే షేర్ ప్రైస్ రూ.2వేలకు చేరుకున్నా చేరుకోవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న స్టాక్స్‌లో రిలయన్స్ హాట్ స్టాక్‌గా ఉంది.


Click it and Unblock the Notifications