రూ.2,000 క్రాస్... రిలయన్స్ రికార్డ్ ధర, అప్పుడు ఇవి కొంటే డబుల్ రిటర్న్స్
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్ ధర రికార్డ్‌స్థాయికి చేరుకుంది. బీఎస్‌ఈలో ధర ఓ సమయంలో రూ.2,010 పలికింది. స్టాక్ మార్కెట్లు బుధవారం(జూలై 22) మార్కెట్లు స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సెన్సెక్స్ 100కు పైగా పాయింట్లు నష్టపోయింది. మధ్యాహ్నం గం.2 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టైటాన్ కంపెనీ, వేదాంత ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, విప్రో ఉన్నాయి. ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2,000 మార్క్ దాటడం గమనార్హం.

రూ.2,000 దాటి.. రూ.12.6 లక్షల కోట్ల ఎం-క్యాప్
రిలయన్స్ షేర్ బుధవారం రూ.2,000లు అందుకుంది. బీఎస్ఈలో కంపెనీ షేర్ రూ.1,980 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభం నుండి స్వల్ప నష్టాల్లోనే ఉన్నాయి. ఈ దశలో రిలయన్స్ షేర్ స్థిరమైన ర్యాలీ చేసింది.
ఓ దశలో 1.79 శాతానికి పైగా పెరిగి రూ.2,010 వద్ద జీవనకాల గరిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత రూ.2000కు దిగువకు చేరుకుంది. మధ్యాహ్నం గం.2 సమయంలో 1.22 శాతం లాభంతో రూ.1,995 వద్ద ఉంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.7 లక్షల కోట్లను తాకింది.

రెండింతల కంటే రిటర్న్స్
రిలయన్స్ షేర్ ధర మూడు నెలల కాలంలో 62 శాతం ఎగిసింది. మార్చిలో అయితే కనిష్టస్థాయి రూ.867.82 నుండి ఏకంగా 130 శాతం లాభపడటం గమనార్హం. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ షేర్లు కొనుగోలు చేసిన వారికి దాదాపు రెండింతలు రిటర్న్స్ వచ్చినట్లు. కాగా, కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్.. రిలయన్స్ టార్గెట్ ధరను రూ.2,150కి సవరించింది. నోమురా రూ.1900 నుండి రూ.2,200కు పెంచింది.

రిలయన్స్ క్యూ1 ఫలితాలు వాయిదా
రియలన్స్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్స్ సమావేశాన్ని జూలై 24వ తేదీ నుంచి జూలై 30 తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది కంపెనీ. రియలన్స్ క్వార్టర్ 1 ఫలితాలు జూలై 30వ తేదిన వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications