reliance q3: భారత్ లో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడవ త్రైమాసికం ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. గతేడాదితో పోలిస్తే ఆదాయం దాదాపు 15 శాతం క్షీణత కనిపించగా.. నికర లాభం 15 వేల కోట్లకు చేరింది.
అయితే రిలయన్స్ గ్రూప్ సంస్థల్లోని జియో, చమురు & రసాయనాలు, రిటైల్ విభాగాలు మాత్రం అందరినీ ఆకర్షిస్తున్నాయి. అంబానీ వారసుల సారథ్యంలో అవి కార్యకలాపాలు సాగిస్తుండటమే అందుకు కారణం. గ్రూపుగా కనబరిచిన ఫలితాలను పక్కన పెట్టి విభాగాల వారీగా చూస్తే.. ఎవరెంత సమర్థవంతంగా రాణిస్తున్నారో అర్థమవుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జియో ప్లాట్‌ఫారం - ఆకాశ్ అంబానీ
ముకేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ జియో ప్లాట్ ఫారంలకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సబ్‌స్క్రైబర్ బేస్, వినియోగదారుల నుంచి సగటు రాబడి (ARPU) పెరగడంతో.. ఈ విభాగం నికర లాభాల్లో వృద్ధి 28 శాతానికి పైగా నమోదు చేసింది. ఆదాయం 21 శాతం పెరిగి దాదాపు 25 వేల కోట్లకు చేరింది. తక్కువ స్పెక్ట్రం ఛార్జీలు, పెరిగిన ARPU వల్ల EBITDA 25.1 శాతం పెరిగి 12 వేల కోట్లకు పైకి వెళ్లింది.

రిలయన్స్ రిటైల్ - ఈశా అంబానీ
రిటైల్ విభాగాన్ని ముకేశ్ కూమార్తె ఈశా నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ కొనుగోళ్లలో భారీ వృద్ధి కారణంగా ఆదాయం సైతం 18.6 శాతం పెరిగి 60 వేల కోట్ల మార్కు దాటింది. గతేడాదితో పోలిస్తే 6.2 శాతం వృద్ధితో సుమారు 2.5 వేల కోట్లకు చేరింది. ఈ విభాగపు EBITDA దాదాపు 25 శాతం పెరిగి 4 వేల 7 వందల కోట్లకు వెళ్లింది.
789 కొత్త స్టోర్ లు ప్రారంభించడంతో.. మొత్తం నెట్ వర్క్ ఏరియా 60 లక్షల చదరపు అడుగులకు విస్తరించింది. 22 లక్షల చదరపు అడుగుల మేరకు వేర్ హౌస్ ను విస్తరించడం ద్వారా మౌలిక సదుపాయాలను పెంచేందుకు పెట్టుబడులు పెడుతోంది.

చమురు, రసాయనాలు - అనంత్ అంబానీ
రిలయన్స్ కు చెందిన ఆయిల్ రిఫైనింగ్ & పెట్రో కెమికల్స్ విభాగానికి రెండవ కుమారుడు అనంత్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరల్లో పెరుగుదల, అధిక ఉత్పత్తి కారణంగా.. మూడో త్రైమాసికంలో ఆదాయం 10 శాతానికి పెరిగి దాదాపు 1.5 కోట్లకు వెళ్లింది. వడ్డీలు, పన్నులు, తరుగుదల (EBITDA)తో కూడిన ఆదాయం 2.9 శాతం పెరిగి 13 వేల 9 వందల కోట్లకు చేరింది.


Click it and Unblock the Notifications