health insurance: రిలయన్స్ వినూత్న బీమా పాలసీ.. ప్రీమియంపై డిస్కౌంట్ పొందాలంటే..
health insurance: ఏదైనా అనుకోని విపత్తు వల్ల ప్రమాదం లేదా మరణం సంభవిస్తే.. బాధితులపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం పలువురు బీమా పాలసీ తీసుకుంటూ ఉంటారు. పలు కంపెనీలు ఆరోగ్య బీమాను సైతం అందిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి ప్రీమియంలు వేర్వేరుగా ఉంటాయి. వ్యక్తుల వయసు, పాలసీ సంవత్సరాలు, మెచ్యూరిటీ మొత్తం వంటి వివిధ అంశాలపై ఆధారపడి పాలసీ రుసుమును ఆయా సంస్థలు నిర్ణయిస్తూ ఉంటాయి. తాజాగా రిలయన్స్ కు సంబంధించిన ఓ హెల్త్ పాలసీ.. వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది.
వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి ఉపయోగించే క్రెడిట్ స్కోర్ ఆధారంగా ప్రీమియంపై డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. ఈ తరహా విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన మొదటి బీమా సంస్థ ఇదే కావడం విశేషం. తమ వినియోగదారులు ఆర్థికంగాను మంచి స్థితిలో నిలవడానికి ఈ విధంగా రివార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. వ్యక్తుల క్రెడిట్ స్కోర్ ఆధారంగా అత్యధికంగా 7.5 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

"ఓ సంస్థగా మేమెప్పుడూ మా వినియోగదారులకు మంచి సేవలు అందించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాం. పరిస్థితులకు తగినట్లుగా వివిధ రకాల ఉత్పత్తులను, సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఆర్థికంగా ఫిట్ గా ఉండటం అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. దీన్ని అర్థం చేసుకునే, ఈ తరహా రివార్డు ప్రోగ్రాం మొదలు పెట్టాం. హెల్త్ ఇన్ఫినిటీ పాలసీ ద్వారా మా కస్టమర్లు తమ ఆరోగ్యంతో పాటు ఆర్థిక స్థితిని సైతం మరింత సమర్థవంతంగా నిర్వహించుకోగలరని విశ్వసిస్తున్నాం" అని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ CEO రాకేష్ జైన్ తెలిపారు.

రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ పాలసీ ద్వారా వివిధ రకాల సౌకర్యాలను వినియోగదారులకు అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అత్యధికంగా 5 కోట్ల వరకు ఇన్సూరెన్స్, అంతర్జాతీయ వైద్యంతో పాటు మెటర్నిటీ, OPD కవరేజ్, అపరిమిత బీమా పునరుద్ధరణ మొత్తం సహా 15 ఇతర యాడ్-ఆన్ ప్రయోజనాలను అందిస్తోంది. గత 8 ఏళ్లుగా స్థిరమైన వృద్ధితో ఈ సంస్థ ముందుకు సాగుతోంది. ఈ పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.reliancegeneral.co.inను సందర్శించవచ్చు.


Click it and Unblock the Notifications