Mukesh Ambani: ఆసియాలోనే రెండో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. సంపన్నుడు తన కుటుంబ కార్యాలయాన్ని(Family Office) సింగపూర్‌లో ప్రారంభించనున్నారు. అక్కడ కార్యాలయంలో ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రత్యేకంగా ఒక మేనేజర్‌ని కూడా నియమించుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇదే క్రమంలో రెండు రోజుల కిందట యాంటిలియాను పేల్చివేస్తామంటూ అంబానీ కుటుంబానికి బెదిరింపులు రావటం సంచలనాన్ని సృష్టిస్తోంది.

కుబేరుల ఎంపిక..
అంబానీలకు ముందు ప్రపంచంలోని చాలా మంది కుబేరులు తమ కుటుంబ కార్యాలయాల కోసం సింగపూర్‌ను ఎంచుకున్నారు. ఈ జాబితాలో బిలియనీర్ రే డాలియో, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ పేర్లు కూడా ఉన్నాయి. తక్కువ టాక్సెస్ తో పాటు మంచి భద్రతా ఏర్పాట్ల కారణంగా సింగపూర్ కుటుంబ కార్యాలయాలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ప్రఖ్యాతి పొందుతోంది. మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ ప్రకారం.. 2021 చివరి నాటికి ఇటువంటి కార్యాలయాల సంఖ్య 700కి పెరిగింది. గత సంవత్సరం వీటి సంఖ్య కేవలం 400 మాత్రమే.
పెరిగిన ధరలు..
ప్రపంచంలోని సూపర్ రిచ్ వ్యక్తులు వారి కుటుంబ కార్యాలయాలను సింగపూర్‌లో ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ద్రవ్యోల్బణం పెరిగింది. సింగపూర్‌లో కార్లు, ఇళ్లు, ఇతర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. సింగపూర్ అభివృద్ధి కోసం ధనికులపై ఎక్కువ టాక్స్ విధించవచ్చని ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ ఆగస్టులో ఒక ఇంటర్వ్యూలో సూచించారు.

వ్యాపార అభివృద్ధికి..
అంబానీ తన వ్యాపారాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నందున.. భారతదేశం బయట ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఈ ప్లాన్ లో భాగంగానే సింగపూర్ లో కుటుంబ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో రిలయన్స్ బోర్డుకు అరమ్‌కో ఛైర్మన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.

ఫ్యామిలీ ఆఫీస్..
ఫ్యామిలీ ఆఫీస్ అనేది సంపన్న కుటుంబాలు స్థాపించుకునే ప్రైవేట్ వెల్త్ మేనేజ్ మెంట్ సంస్థ. ఇది సంపన్న కుటుంబానికి చెందిన పెట్టుబడుల నిర్వహణ, ఫైనాన్సియల్ ప్లానింగ్, టాక్స్ ప్లానింగ్, దాతృత్వ పెట్టుబడులతో పాటు ఇతర వ్యవహారాలను చూసుకుంటాయి. వీటిని స్థాపించటం, నిర్వహించటం చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. ఇలాంటి వాటిని ఎక్కువగా సంపన్న కుటుంబాలు మాత్రమే ప్రారంభిస్తుంటాయి. దీని ద్వారా ప్రస్తుత, తరువాతి తరాలకు సంపదను అందించటమే లక్ష్యంగా పనిచేస్తాయి.


Click it and Unblock the Notifications