దేశంలోనే అతిపెద్ద మెడికల్ ఆక్సిజన్ ప్రొడ్యూసర్‌గా..రిలయన్స్: రోజూ ఎన్ని మెట్రిక్ టన్నులంటే?
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోంది. అతలాకుతలం చేస్తోంది. సంక్షోభ పరిస్థితులకు కారణమైంది. ఇదివరకెప్పుడూ లేనంతగా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా పడింది. లక్షల కొద్దీ కేసులు పుట్టుకుని వస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా 32 లక్షలకు పైగా కరోనా వైరస్ యాక్టివ్ కేసులు నమోదైన ప్రస్తుత పరిస్థితుల్లో.. వారందరికీ వైద్య చికిత్సను అందించడం కష్టసాధ్యమౌతోంది. ఆసుపత్రులు చాలట్లేదు. ఆక్సిజన్ కొరత దేశాన్ని వెంటాడుతోంది. ప్రాణవాయువు అందక పదుల సంఖ్యలో పేషెంట్లు మృత్యువాత పడుతున్నారు.
ఈ పరిస్థితిని అధిగమించడానికి దేశవ్యాప్తంగా ఉన్న పలు ఉక్కు కర్మాగారాలు, ఎరువుల తయారీ ఫ్యాక్టరీలు మెడికల్ ఆక్సిజన్‌ను యుద్ధ ప్రాతిపదికన తయారు చేస్తోన్నాయి. అయినప్పటికీ- లోటు మాత్రం భర్తీ కావట్లేదు. ఈ పరిస్థితుల్లో దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్.. ఆక్సిజన్ ఉత్పత్తికి దిగింది. రోజూ 1,000 మెట్రిక్ టన్నుల మేర లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను తయారు చేస్తోంది. దేశం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే మెడికల్ ఆక్సిజన్‌తో పోల్చుకుంటే.. 11 శాతం మేర తాము ప్రొడ్యూస్ చేసినట్లు తెలిపింది.

రిలయన్స్ యాజమాన్యానికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిఫైనరీ ప్లాంట్ ఉంది. అక్కడే- మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఒకేచోట.. ఒకే ప్లాంట్‌లో ఇంత పెద్ద మొత్తంలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను తయారు చేయడం ఇదే తొలిసారి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. లాజిస్టిక్ సమస్యలపైనా ఆయన దృష్టి పెట్టారు. జామ్‌నగర్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్‌ను వేర్వేరు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆరంభమైన తొలి రోజుల్లో 55,000 మెట్రిక్ టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సీజన్‌ను సరఫరా చేసిన అనుభవం ఆ సంస్థకు ఉంది.




Click it and Unblock the Notifications