రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నియంత్రణలోని Viacom18.. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో 3 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. తద్వారా వచ్చే నెల నుంచి ప్రసిద్ధ HBO ఒరిజినల్స్, వార్నర్ బ్రదర్స్ కంటెంట్ ను JioCinemaలో ప్రసారం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ డీల్ విలువ దాదాపు వెయ్యి కోట్లుగా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రీమియం ఇంగ్లీష్ కంటెంట్ వీక్షకులను JioCinema ఆకర్షించడానికి ఇది సహాయపడుతుంది.
సంస్థ కథనం ప్రకారం.. ఈ ఒప్పందంలో Viacom18 యొక్క సాధారణ టెలివిజన్ ఛానెల్‌ల హక్కులు కూడా భాగమయ్యాయి. తద్వారా కొంత కంటెంట్ ను దాని ఇంగ్లీష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లలో ప్రసారం చేసుకునే అవకాశమూ ఉంది. భారతదేశంలో తన స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ మ్యాక్స్ లాంచ్ ను హోల్డ్ లో ఉంచిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి ఈ డీల్ మంచి జాక్ పాట్ గా చెప్పవచ్చు.

అయితే ఈ ఒప్పందంపై వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, Viacom18 స్పందించడానికి నిరాకరించాయి. మొదట ఈ డీల్ కోసం 150 మిలియన్ డాలర్ల వద్ద చర్చలు జరగ్గా.. చివరకు 120కు ఫైనల్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో వాల్ట్ డిస్నీ భారతీయ యూనిట్ డిస్నీ స్టార్, HBO ఒరిజినల్స్ కోసం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో తన దీర్ఘకాల కంటెంట్ ఒప్పందాన్ని మార్చి 31న ముగించింది. ఫలితంగా ప్రముఖ గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ డ్రాగన్ వంటి 144 షోలు వీక్షించే అవకాశం ఉండదు.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఐదేళ్ల డీల్ కోసం సంవత్సరానికి 10 మిలియన్ డాలర్లు అడుగుతున్నట్లు వార్తా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం లాభాల కోసం చూస్తున్న డిస్నీ+ హాట్‌స్టార్ తగినంత విలువైనదిగా భావించలేదు. Viacom18తో ఒప్పందం HBO ఒరిజినల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా దానికి చెందిన టీవీ లైబ్రరీతో సహా వార్నర్ బ్రదర్స్ టెలివిజన్ సిరీస్‌లోని కంటెంట్ ను కూడా కలిగి ఉంది. మరో విషయం ఏంటంటే.. ఒప్పందంలో భాగంగా, USలో ప్రసారమవుతున్న కంటెంట్ అదే రోజున భారతదేశంలోనూ ప్రదర్శితమవుతుంది.
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ని JioCinema ఉచితంగా ప్రసారం చేస్తోంది. కాగా మొత్తం ఇంగ్లీష్ కంటెంట్ ను పేవాల్ వెనుక ఉంచాలని భావిస్తోంది. "మేము భారతీయులందరికీ వినోదం కోసం ఒక గమ్యస్థానాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నాము. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మా వినియోగదారులకు అత్యుత్తమ హాలీవుడ్ కంటెంట్‌ను అందించే మా ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయి. ఈ ఒప్పందం మా వినియోగదారులకు ఉత్తమమైన, అత్యంత సమగ్రమైన కంటెంట్ ను సృష్టించడానికి అనుమతిస్తుంది" అని Viacom18 ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ ఫెర్జాద్ పాలియా తెలిపారు.


Click it and Unblock the Notifications