Jhunjhunwala: ఒక్క రోజులో రూ.237 కోట్లు సంపాదించిన జున్‌జున్‌వాలా..!! ఎలాగంటే..
Jhunjhunwala: దివంగత బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా లేనప్పటికీ ఆయన ఫ్యామిలీ దేశీయ స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉంది. ఆయన భార్య రేఖాతో పాటు వారి సంస్థ ట్రేడింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు.
గతంలో రాకేష్ పోర్ట్ ఫోలియోను ఫాలో అయ్యే అనేక మంది ఇప్పుడు రేఖా పెట్టుబడులను గమనిస్తున్నారు. తాజాగా ఆమె రెండు టాటా గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా ఏకంగా రూ.237 కోట్లను ఆర్జించారు. జున్‌జున్‌వాలా ఫ్యామిలీకి లాభాల పంట కురిపించిన కంపెనీలు ఒకటి టాటా మోటార్స్ కాగా రెండవది టాటాలకు చెందిన టైటాన్ కంపెనీ.

గత శుక్రవారం టాటా మోటార్స్ షేర్లు స్టాక్ మార్కెట్లలో లాభాలతో ప్రయాణాన్ని ప్రారంభించాయి. అయితే తక్కువ సమయంలోనే స్టాక్ ధర రూ.541.25 స్థాయికి చేరుకుంది. దీంతో టాటా మోటార్స్ తన కొత్త 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అలాగే టాటాలకు చెందిన మరో స్టాక్ టైటాన్ సైతం శుక్రవారం మార్కెట్లో మంచి పనితీరును కనబరిచింది. అలా ఇంట్రాడేలో గరిష్ఠ స్థాయి రూ.2,871కి చేరుకుంది. ఇది ఎన్ఎస్ఈలో కంపెనీకి కొత్త గరిష్ఠాలు కావటం విశేషం.
టాటా మోటార్స్ షేర్ హోల్డింగ్ వివరాల ప్రకారం రేఖా జున్‌జున్‌వాలా జనవరి నుంచి మార్చి 2023 వరకు కంపెనీలో 5,22,56,000 షేర్లను కలిగి ఉన్నారు. అంటే టాటా మోటార్స్‌లో వీరి మొత్తం వాటా 1.57 శాతం. శుక్రవారం టాటా మోటార్స్ షేరు ధర రూ.535.20 స్థాయి నుంచి రూ.541.25 స్థాయికి చేరుకోవటంతో రేఖా జున్‌జున్‌వాలా ఒక్కరోజులోనే ఏకంగా రూ.31.61 కోట్లను సంపాదించారు.
ఇదే సమయంలో రేఖా జున్‌జున్‌వాలా టైటాన్ షేర్ హోల్డింగ్ గమనిస్తే మార్చి 2023 నాటికి కంపెనీలో 5.29 శాతం వాటాలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో టైటాన్ షేర్ల ధర పెరగటంతో ఒక్కో షేరు ధర ఏకంగా రూ.43.75 మేర పెరిగింది. ఈ కారణంగా రేఖా జున్‌జున్‌వాలా కేవలం ఒక్క రోజులో టైటాన్ షేర్ల నుంచి రూ.205.38 కోట్ల లాభాన్ని ఆర్జించారు. అంటే టాటాలకు చెందిన రెండు కంపెనీల నుంచే ఒక్క రోజులో జున్‌జున్‌వాలా రూ. 237 కోట్ల లాభాన్ని పొందారు.


Click it and Unblock the Notifications