IPO News: త్వరలో మార్కెట్లోకి రేఖా జున్‌జున్‌వాలా ఐపీవో ప్రారంభం.. పూర్తి వివరాలివే..
Rekha Jhunjhunwala: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం భారీగా ఉండనుంది. మెయిన్ కేటగిరీతో పాటు ఎస్ఎమ్ఈ కేటగిరీలో కూడా అనేక ఐపీవోలు క్యూ కడుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి చూపు రేఖా జున్‌జున్‌వాలా సంస్థ ఐపీవోకి రావటంతో ఇన్వెస్టర్ల దృష్టి దానిపైకి మళ్లింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రేఖా రాకేష్ జున్‌జున్‌వాలా మద్దతుగల బజార్ స్టైల్ రిటైల్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ ఇప్పటికే తన ఐపీవోకి సంబంధించిన దరఖాస్తును సెబీ వద్ద ఉంచింది. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో రూ.834.68 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో కొత్త ఇష్యూ రూ.148 కోట్లు ఉండగా.. మిగిలిన మెుత్తం ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్లు విక్రయించే వాటాల ద్వారా సమీకరించనున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐపీవో లిస్టింగ్ సెప్టెంబర్ 6న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఉంటుందని తెలుస్తోంది.

ఈ క్రమంలో బజార్ స్టైల్ రిటైల్ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.370 నుంచి రూ.389గా నిర్ణయించింది. అలాగే పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని 38 షేర్లుగా ప్రకటించింది. దీని ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కొనుగోలు చేసేందుకు రూ.14,782 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. రిటైల్ పెట్టుబడిదారుల కోసం ఐపీవో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు తెరచి ఉండనుంది. కంపెనీ ఐపీవో ద్వారా సమీకరించిన మెుత్తంలో కొంత భాగాన్ని రుణాల చెల్లింపులకు వినియోగించాలని చూస్తోంది. దీనికి తోడు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కూడా ఈ డబ్బును వినియోగించనుంది.
కంపెనీ ఆర్థిక పనితీరును పరిశీలిస్తే FY24లో కంపెనీ మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన రూ.794 కోట్ల నుంచి 23 శాతం పెరిగి రూ.982 కోట్లుగా నివేదించింది. ఈ క్రమంలో లాభం రూ.21 కోట్లుగా నివేదించబడింది.
కంపెనీ వ్యాపారం..
జూన్ 2013లో స్థాపించబడిన బజార్ స్టైల్ రిటైల్ లిమిటెడ్ పశ్చిమ బెంగాల్, ఒడిశాలో పనిచేస్తున్న ఫ్యాషన్ రిటైలర్. కంపెనీ పురుషులు, మహిళలు, బాలురు, బాలికలు, శిశువులకు దుస్తులు, నాన్-అపెరెల్స్, హోమ్ ఫర్నిషింగ్ ఉత్పత్తుల వంటి సాధారణ వస్తువులను విక్రయిస్తోంది. ప్రస్తుతం కంపెనీ తన వ్యాపారాన్ని ఒడిశా, బిహార్, అసోం, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఛత్తీస్‌గఢ్‌లలో నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications