రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్థ గంట ముందు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు.. కొత్త నిబంధనలు ఇవే..
భారతీయ రైల్వే వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ.. ప్రయాణికుల సేవల్లో పారదర్శకత, రవాణా సామర్థ్యం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐదు కీలక సంస్కరణలను ప్రకటించారు.
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వే నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా రైలు టిక్కెట్ల రద్దు (Cancellation), రీఫండ్ నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పులు సామాన్య ప్రయాణికులపై నేరుగా ప్రభావం చూపనున్నాయి.
రైల్వే మంత్రి ప్రకటించిన అత్యంత కీలకమైన మార్పు టిక్కెట్ రద్దు సమయం.. దానికి లభించే వాపసు (Refund) మొత్తానికి సంబంధించింది. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల కంటే తక్కువ వ్యవధిలో ధృవీకరించబడిన (Confirmed) టిక్కెట్లను రద్దు చేసుకుంటే.. ప్రయాణికులకు రూపాయి కూడా వెనక్కి రాదు.

చివరి నిమిషంలో టిక్కెట్లు రద్దు చేయడం వల్ల సీట్లు వృధా అవుతున్నాయని.. తద్వారా వేచి ఉన్న ఇతర ప్రయాణికులకు అవకాశం దక్కడం లేదని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 8 గంటల నిబంధన ద్వారా సీట్ల లభ్యతను మెరుగుపరచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
సవరించిన రీఫండ్ నిబంధనలను పరిశీలిస్తే.. సమయాన్ని బట్టి జరిమానా విధిస్తారు. రైలు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందే టిక్కెట్ రద్దు చేసుకుంటే, ప్రతి ప్రయాణికుడికి నిర్ణీత రద్దు రుసుము మినహాయించి మిగిలిన మొత్తం వాపసు లభిస్తుంది. ఒకవేళ 72 గంటల నుండి 24 గంటల లోపు రద్దు చేస్తే.. టిక్కెట్ ధరలో 25 శాతం జరిమానా విధిస్తారు. ఇక 24 గంటల నుండి 8 గంటల లోపు రద్దు చేసుకునే వారికి సగం ధర (50 శాతం) మాత్రమే వెనక్కి వస్తుంది. ఎనిమిది గంటల కంటే తక్కువ సమయం ఉన్నా లేదా రైలు బయలుదేరిన తర్వాత రద్దు చేసినా ఎటువంటి రీఫండ్ ఉండదు.
అయితే, కఠిన నిబంధనలతో పాటు ప్రయాణికులకు కొన్ని ఊరట కలిగించే అంశాలను కూడా మంత్రి ప్రకటించారు. ప్రయాణికులు తమ ప్రయాణ తరగతిని (Travel Class) అప్‌గ్రేడ్ చేసుకోవడానికి లేదా బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకోవడానికి గతంలో ఉన్న పరిమితులను సడలించారు. ఇకపై రైలు బయలుదేరడానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. గతంలో రిజర్వేషన్ చార్ట్ తయారీకి ముందే ఈ మార్పులు చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ గడువును చివరి నిమిషం వరకు పొడిగించడం ప్రయాణికులకు ఎంతో లాభదాయకం.
రైల్వే ఆదాయ వనరుల్లో ప్రధానమైన సరుకు రవాణా రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఉప్పు, ఆటోమొబైల్స్ (కార్లు, వాహనాలు) రవాణాను వేగవంతం చేసేందుకు కొత్తగా సింగిల్-డెక్, డబుల్-డెక్ వ్యాగన్‌లను ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ సరుకును సురక్షితంగా రవాణా చేసే అవకాశం కలుగుతుంది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే నిర్మాణ ప్రాజెక్టుల నాణ్యతను పెంచడంపై కూడా ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. 2026 నాటికి భారతీయ రైల్వేను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మార్చడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు అమలులోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications