ఈ మధ్యకాలంలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతుంది. చాలా మంది ఎక్కువసేపు లాప్‌టాప్ ముందు కూర్చొని పని చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు చాలామటికి వస్తున్నాయి. ఇది గుర్తించిన ఇన్ఫోసిస్ HR టీమ్, ఉద్యోగులకు ఒక మెయిల్ పంపింది "పని చేయడం ముఖ్యం, కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే అది మీకే కాదు, కంపెనీకీ కూడా నష్టమే" అని సూచించింది. ఈ మెయిల్‌లో, వర్క్- లైఫ్ బ్యాలెన్స్ ని పాటించమని సాఫ్ట్‌గానే ఉద్యోగులను ఆలోచింపజేసే ప్రయత్నం చేశారు.

ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగుల పని గంటలపై ఇప్పుడు మరింత శ్రద్ధ చూపుతోంది. రోజుకు 9 గంటలు 15 నిమిషాలకంటే ఎక్కువగా పనిచేస్తున్నవారికి ప్రత్యేకంగా హెచ్చరిక ఇమెయిల్స్ పంపుతోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదంతా సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చెప్పిన "వారానికి 70 గంటలు పని చేయాలి" అన్న వాక్యానికి భిన్నంగా ఉంది. అంటే సంస్థ ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం బెంగళూరు లోని ఇన్ఫోసిస్ సంస్థ మొత్తం అక్కడ ఉన్న ఉద్యోగుల(3,23,500)కి హైబ్రిడ్ వర్కింగ్ (ఆఫీస్ + రిమోట్) విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం, ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీసులో ఉండాలి. అలాగే, రిమోట్ వర్క్ సమయంలో కూడా రోజుకు 9 గంటలు 15 నిమిషాలు మించి పని చేస్తే, ఆటోమేటిక్‌గా అలర్ట్ జెనరేట్ అవుతుంది.
ఉద్యోగులు నిర్ణయించిన పని గంటలకు మించి అదనంగా పని చేయవద్దని సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు రోజుకు వారి పని వేళలు మించకుండా పని చేయాలని సూచించింది. ఉద్యోగులు పని మధ్యలో విరామాలు తీసుకోవాలి, పని గంటలు పూర్తయిన వెంటనే విశ్రాంతి తీసుకోవాలి అని సూచించింది. ఈ సందేశం ఎందుకు పంపించింది అంటే ఇటీవలి కాలంలో, ఉద్యోగులు ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నవాళ్లు పని గంటలు ఎక్కువగా పెంచేస్తున్నారు. ఒక్కోసారి లంచ్ బ్రేక్ లేకుండా, సెలవులు లేకుండా పని చేస్తున్నవాళ్లూ ఉన్నారు. ఈ పరిస్థితి ఫలితంగా స్ట్రెస్, మానసిక అలసట, ఫిజికల్ బర్నౌట్ వస్తున్నట్లు సంస్థ గమనించింది.
సిస్టమ్ మానిటరింగ్ తో పరిశీలన:
ఇన్ఫోసిస్ ఇప్పుడు ఉద్యోగుల పని సమయాన్ని ఒక ఆటోమేటెడ్ ట్రాకింగ్ టూల్ ద్వారా గమనిస్తుంది. ఒక్కొక్క ఉద్యోగి రోజుకు ఎంత పని చేస్తున్నాడు? వారానికి ఎంత సమయం పని చేశాడు? అన్నదాని మీద ఓ డేటా రిపోర్ట్ తయారవుతుంది. ఇది వారానికి ఐదు రోజులు, రోజు పరిమితి కంటే ఎక్కువ అయితే... వెంటనే హెచ్చరిక మెయిల్ వస్తోంది.
ఇతర కంపెనీలు కూడా ఇప్పుడు ఉద్యోగుల మెరుగైన అనుభవం కోసం కొన్ని ముఖ్యమైన మార్పులను పాటించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు రోజుకు గరిష్ఠంగా 8 నుంచి 9 గంటల వరకు మాత్రమే పని చేయాలని స్పష్టమైన గైడ్‌లైన్స్ ఉండాలి. ఇది అధిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అలాగే, వారానికి రెండు రోజుల విశ్రాంతి, సెలవుల్లో పని చేయకుండా ఉండే పని సంస్కృతి ఏర్పడితే, వర్క్- లైఫ్ బ్యాలెన్స్ సాధ్యం అవుతుంది. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ కూడా అవసరం. ఉద్యోగులు తాము అనుకూలంగా అనిపించే సమయానికి పని చేయగలగాలి. ఉదాహరణకు, కొందరికి ఉదయం పని సౌకర్యంగా ఉంటే, మరికొందరికి సాయంత్రం అలా ఈ విధంగా వారికి స్వేచ్ఛ కల్పించాలి.
ఆరోగ్య పరిరక్షణకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, మానసిక ఆరోగ్య కార్యక్రమాలు, ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లు సంస్థలు అందించాలి. అంతేకాక, ఉద్యోగులు చేసే పనికి స్పష్టమైన లక్ష్యాలు ఉండటం, ఆ పనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకునే విధంగా పారదర్శకత ఉండాలి. చివరగా, రొటీన్ టాస్కులను ఆటోమేట్ చేసి, ఉద్యోగుల సమయాన్ని సృజనాత్మక పనులకు ఉపయోగించేలా చేయడం ద్వారా సంస్థల దృక్పథం మారుతుంది. ఈ మార్పులు చేస్తే ఉద్యోగులు సంతోషంగా, మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఈ విధంగా, హైబ్రిడ్ కల్చర్‌తో పాటు కొత్త విధానాలను అనుసరించడం ద్వారా టెక్ కంపెనీలు ఉద్యోగుల సంక్షేమాన్ని చూసుకోవచ్చు.


Click it and Unblock the Notifications