Tata Power: ప్రఖ్యాతిగాంచిన టాటా గ్రూప్ కంపెనీలు అంటే ప్రజలకుఎంతో నమ్మకం. పలు కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నా మానవతా దృక్పథంతో ఆలోచించింది టాటా గ్రూప్. అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థపై అప్పుడప్పుడు ఆరోపణలు వస్తూ ఉంటాయి. తాజాగా రెడ్డిట్‌లో ఓ యూజర్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఆందోళనలు రేకెత్తిస్తోంది. టాటా గ్రూప్ లో అలా జరగడం ఏమిటి అని, అసలు ఇది నిజమా కాదా అని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు.
టాటా పవర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. ల్యాప్‌టాప్ బై బ్యాక్ తప్పనిసరి చేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుందని తెలిపాడు. సంస్థను వదిలి వెళ్లే ముందు ఉద్యోగులు ఉపయోగి స్తున్న ల్యాప్టాప్ ను వారే కొనుగోలు చేసే విధంగా నిబంధనలు మార్చినట్లు వెల్లడించాడు. ఇందుకోసం 65 వేలు చెల్లించాలని చెప్పినట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని, తాను త్వరలోనే సంస్థ నుంచి నిష్క్రమించాలని భావిస్తున్నట్లు వివరించాడు.

తాను కంపెనీలో చేరి 1.2 సంవత్సరాలు కావస్తుందని, అప్పుడు ఈ నిబంధనల గురించి యాజమాన్యం ఏమీ చెప్పలేదని ఆ యూజర్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. గత ఆరు నెలల క్రితమే మేనేజ్‌మెంట్ ఇందుకు సంబంధించి షరతులు మరియు నిబంధనలతో కూడిన సర్క్యులర్ రిలీజ్ చేసిననట్లు చెప్పుకొచ్చాడు. కంపెనీ నిబంధనలు పాటించకుండా ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయడం తిరస్కరిస్తే తనకు ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.

ఈ వ్యవహారంలో చట్టపరంగా ముందుకు సాగేందుకు సలహా ఇవ్వవలసినదిగా ఆ యూజర్ రెడ్డిట్‌లో కోరాడు. న్యాయ నిపుణుల సూచనల మేరకు నడుచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ వ్యవహారంపై నెట్టింట దుమారం చెలరేగింది. అతడి పోస్టుపై పలువురు యూజర్లు స్పందిస్తున్నారు. తమకు తోచనం విధంగా సలహాలు ఇస్తున్నారు. అయితే అసలు ఇదంతా నిజం కాదని కొట్టిపడేసే వారూ ఉన్నారు. కాగా ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications