TCS News: టీసీఎస్‌లో బయటపడ్డ కుంభకోణం.. టెక్కీలు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి..
TCS News: చాలా కాలంగా ఐటీ రంగంలో దొడ్డిదారినైనా టెక్కీగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కొందరు దళారులు కంపెనీలోని ఉద్యోగులతో పరిచయాలు ఉన్నాయంటూ కోర్సులు నేర్పి మరీ వారిని టెక్కీలుగా మార్చటం విరివిగా కొనసాగుతూనే ఉంది.
టాటాలకు చెందిన టెక్ దిగ్గజం టీసీఎస్ గడచిన మూడేళ్లుగా ఏడాదికి సగటున 50,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంటోంది. వేలాది మంది కీలక సిబ్బందిని నియమించుకునే బాధ్యతను అప్పగించిన కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు లంచాలు తీసుకుంటున్నట్లు కంపెనీ గుర్తించింది. నియామక ప్రక్రియలో డబ్బు తీసుకుని రాజీ పడుతున్నట్లు కుంభకోణం గుట్టురట్టయింది. కంపెనీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (RMG)లోని నిర్దిష్ట వ్యక్తులపై చర్యలు చేపట్టినట్లు మింట్ వార్తా సంస్థ నివేదించింది.

విజిల్‌బ్లోయర్ ఫిర్యాదు తర్వాతో కంపెనీ అప్రమత్తమైంది. దర్యాప్తు చేయడానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అజిత్ మీనన్‌తో సహా ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో TCS తన రిక్రూట్‌మెంట్ హెడ్‌ని సెలవుపై పంపడం.. అలాగే RMG డివిజన్‌లోని నలుగురు అధికారులను తొలగించింది. అలాగే మూడు స్టాఫింగ్ సంస్థలపై నిషేధం విధించడంతో విచారణ ముగిసింది.
నిందితుల్లో ఒకరైన ఆర్‌ఎంజీ గ్లోబల్ హెడ్ ఈఎస్ చక్రవర్తి కార్యాలయంలోకి రాకుండా టీసీఎస్ నిషేధం విధించింది. ఆర్‌ఎంజీ విభాగానికి చెందిన మరో అధికారి అరుణ్ జీకే కూడా తొలగించబడ్డారు. ఈ కుంభకోణంలో పాల్గొన్న వారు గత మూడేళ్ల కాలంలో కనీసం రూ.100 కోట్ల మేర కమిషన్లు పుచ్చుకున్నట్లు అంచనా వేశారు. టీసీఎస్ సీఈవోగా కె.కృతివాసన్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు కంపెనీలో మెుదటి కుంభకోణం బయటపడటం గమనార్హం.

దాదాపు 28 బిలియన్ డాలర్ల ఆదాయంతో 6,14,795 మంది ఉద్యోగులను కలిగి ఉన్న అతిపెద్ద దేశీయ టెక్ కంపెనీలో రిక్రూట్‌మెంట్ కుంభకోణం బహిర్గతం కావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇది రిక్రూట్మెంట్లో ఉన్న లూప్ హోల్స్ గురించి నొక్కి చెబుతోంది. అయితే ఇలాంటి లంచాలు ఇవ్వటానికి ఉద్యోగార్థులు దూరంగా ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications